భారత ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మహిళా ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ‘AI by HER Global Impact Challenge అనే అంతర్జాతీయ పోటీని ప్రారంభించింది. ఈ పోటీ ద్వారా మహిళలు రూపొందించిన సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగపడే AI పరిష్కారాలను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం.
ఈ కార్యక్రమాన్ని MyGov India, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)మరియు IndiaAI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు తమ ప్రాజెక్టులను సమర్పించవచ్చు.
ఈ పోటీని 2026 ఫిబ్రవరి 19–20 తేదీల్లో న్యూఢిల్లీ లో జరిగే IndiaAI Impact Summit 2026 లో భాగంగా నిర్వహించనున్నారు.
బహుమతులు
పోటీలో గెలిచిన టాప్ 10 జట్లు లేదా వ్యక్తులకు రూ.25 లక్షల నగదు బహుమతి ఇవ్వబడుతుంది. అదనంగా, వారిని మెంటార్షిప్, నిపుణుల మార్గదర్శకత్వం, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. టాప్ 30 ఫైనలిస్టులు తమ AI ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, గ్లోబల్ నిపుణుల ముందుంచే అవకాశం పొందుతారు.
అర్హత నియమాలు
ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా బృందాలు లేదా వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో బృందంలో గరిష్ఠంగా మూడు మంది సభ్యులు ఉండవచ్చు, అందులో కనీసం ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ప్రధాన నాయకురాలు Founder, Co-founder, CEO, CTO లేదా Product Lead వంటి పదవిలో ఉండాలి.
స్టార్టప్‌లు, MSMEలు, అకాడమిక్ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉన్న ఆలోచనలను కాకుండా పూర్తిగా తయారైన లేదా పైలట్ దశలో ఉన్న AI పరిష్కారాలనే స్వీకరిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ యజమాని నుంచి No Objection Certificate (NOC) సమర్పించాలి.
పోటీని ఆరు విభాగాలుగా విభజించారు
1. వ్యవసాయం: ప్రెసిషన్ ఫార్మింగ్, పీడక నియంత్రణ, వనరుల వినియోగం.
2. సైబర్ సెక్యూరిటీ & డిజిటల్ వెల్బీయింగ్:గోప్యత, నమ్మకం, ఆన్లైన్ భద్రత.
3. విద్య: బహుభాషా విద్యా మోడళ్లు, అందుబాటులో ఉన్న లెర్నింగ్ టూల్స్.
4. ఆరోగ్యం: డయాగ్నోస్టిక్ సపోర్ట్, టెలీమెడిసిన్, డేటా ఆధారిత అంచనాలు.
5. ఎనర్జీ & క్లైమేట్: శుభ్రమైన శక్తి, ఉద్గారాల పర్యవేక్షణ.
6. ఓపెన్ ఇన్నోవేషన్: ఏ రంగానికైనా సరిపోయే అంతరశాఖ పరిష్కారాలు.
దరఖాస్తులు 2025 అక్టోబర్‌లో MyGov పోర్టల్ ద్వారా ప్రారంభమవుతాయి. మొదటి స్క్రీనింగ్ రౌండ్ అక్టోబర్ నుండి నవంబర్ 2025 వరకు ఉంటుంది. తరువాత బూట్‌క్యాంప్ సెషన్లు మరియు ప్రదర్శనలు జరగనున్నాయి. విజేతలను 2026 ఫిబ్రవరిలో జరిగే IndiaAI Summit లో ప్రకటిస్తారు.
మహిళలు తమ సృజనాత్మకతను AI ద్వారా ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇది ఒక అద్భుత అవకాశం. టెక్ రంగంలో మహిళల నాయకత్వాన్ని బలోపేతం చేయడం, సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను తీసుకురావడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం.