భారతదేశానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియా పర్యాటకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. భారతీయుల ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ అతను పంచుకున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘India deserves a world record for this’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన వీడియోలో డంకన్ మెక్‌నాట్ అనే ఆస్ట్రేలియా పర్యాటకుడు తన భారత యాత్రలో ఎదుర్కొన్న అద్భుత అనుభవాలను వివరించాడు.
డంకన్ తన ప్రయాణంలో గౌరవ్ అనే భారతీయుడిని కలిసినట్టు తెలిపారు. గౌరవ్ అతనికి సంపూర్ణ భారతీయ ఆతిథ్యం ఇచ్చాడని, తిండి నుంచి ప్రయాణం వరకు అన్ని విషయాలను చూసుకున్నాడని పేర్కొన్నారు. “భారతీయుల ఆతిథ్యం ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రత్యేకం.
గౌరవ్‌ను మూడురోజుల క్రితం కలిశాను. ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు. వారి కుటుంబంతో కలిసి పెళ్లి వేడుకకు వెళ్లాను. గోల్డెన్ టెంపుల్ చూపించాడు. ఇప్పుడు జైపూర్‌కు బస్సు కూడా ఏర్పాటుచేశాడు. ఇది అద్భుతం, ధన్యవాదాలు ఇండియా!” అంటూ డంకన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది భారతీయులు అతని మాటలకు అంగీకరించగా, కొందరు ఆయన భారతదేశంపై చూపించిన సానుకూల దృక్పథాన్ని అభినందించారు. “నేను కూడా ఇటీవల భారత్‌కు వెళ్లాను. ప్రజలు అద్భుతంగా ఉంటారు,” అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరొకరు “ప్రతీ దేశానికి మంచిదీ చెడ్డదీ ఉంటుంది. మీరు మంచి కోణం చూసారు, ధన్యవాదాలు” అన్నారు.
మరికొందరు భారతీయులు ఆయన మాటలను గర్వంగా స్వాగతించారు. “ఇలాంటి ప్రశంసలు వింటే ఆనందంగా ఉంటుంది. కొంతమంది పాశ్చాత్య దేశాలు భారత్‌పై విమర్శలు చేస్తున్నా, ఇలాంటి వీడియోలు నిజాన్ని చూపిస్తున్నాయి,” అని ఒకరు రాశారు.
తదుపరి వీడియోలో డంకన్, సోషల్ మీడియా భారతదేశాన్ని తప్పుగా చూపుతుందని వ్యాఖ్యానించాడు. “భారత్ ఒక అందమైన దేశం. ఇక్కడి సంస్కృతి, వైవిధ్యం, ప్రజలు అద్భుతంగా ఉన్నారు. ఏ దేశానికైనా సమస్యలు ఉంటాయి, కానీ భారత్ గురించి ప్రపంచానికి తప్పుగా చూపించడం విచారకరం. వచ్చే మూడు నెలల్లో నేను భారతదేశంలోని అందమైన ప్రాంతాలను చూపిస్తాను,” అని అన్నారు.
డంకన్ మెక్‌నాట్ వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆతిథ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆయన మాటలు మిలియన్ల మందికి భారతీయ సంస్కృతి ఎంత ఆత్మీయంగా, హృదయపూర్వకంగా ఉందో మరోసారి గుర్తు చేశాయి.