Jamaica Cyclone news : జమైకా గ్రేటర్ ఆంటిల్లెస్ లోగల ఒక ద్వీప దేశం ఈ వారంలో చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. మెలిసా తుపాను గంటకు 295 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడి, దేశాన్ని దాదాపు చీకటిలోకి నెట్టేసింది. చెట్లు నేలకూలాయి, కొండచరియలు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా సగానికి పైగా నిలిచిపోయింది ఫలితంగా దేశంలో సగానికి పైగా ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి.
వాతావరణ శాఖ ఈ తుపానును కేటగిరీ-5గా ప్రకటించింది. రాజధాని కింగ్స్టన్ నగరం భయంతో నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రజలు ఇళ్లలోనే తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ మాట్లాడుతూ మెలిసా తుపాను ప్రభావం దేశానికి భయంకరంగా ఉందని, నష్టాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రభుత్వం అత్యవసర సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపి సహాయం ప్రారంభించింది.
తీరప్రాంతాల్లో రాకాసి అలలు ఎగిసిపడుతుండగా ప్రజల భద్రత కోసం లోతట్టు ప్రాంతాల వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. రహదారులు విమానాశ్రయాలు, ప్రజారవాణా వ్యవస్థలు అన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మెలిసా ప్రభావం క్యూబా హైతీ, బహమాస్, డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాల మీద కూడా పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు, స్వచ్ఛంద సంస్థలు జమైకాకు ఆహారం, మందులు, తాగునీరు వంటి సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.
అయితే తుపాను తీవ్రతను చూపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తున్న నకిలీ వీడియోలు, ఫోటోలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. అధికారులు ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జమైకాలో దాదాపు 25 వేల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది.
174 ఏళ్లుగా జమైకాలో తుపానుల రికార్డులు ఉన్నప్పటికీ, ఇంతటి విధ్వంసకరమైన తుపాను ఎప్పుడూ రాలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇళ్లను, భవనాలను ధ్వంసం చేసిన మెలిసా తుపానుతో దేశం ఆర్థికంగా కూడా తీవ్రమైన దెబ్బతిన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు తాగునీరు, ఆహారం, ఇంధనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా రోడ్లు తెగిపోవడంతో సహాయక బృందాలు చేరలేకపోతున్నాయి.
మెలిసా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేందుకు ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం జమైకా మొత్తం ప్రళయ భయంతో జీవిస్తోంది. మానవ నిర్మిత అద్భుతాల కంటే ప్రకృతి శక్తి ఎంత గొప్పదో మెలిసా మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.