న్యూఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 21వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగానే తమ స్కాన్ చేసిన ఫోటో, సంతకం సిద్ధంగా ఉంచుకోవాలని బోర్డు సూచించింది.
ఈసారి పరీక్ష ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం)న దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో — పేపర్–1 (ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం), పేపర్–2 (ఉన్నత ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కోసం) — నిర్వహించబడనుంది.
ఒక పేపర్‌కి ₹1,000 రుసుము, రెండు పేపర్లకు ₹1,200గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది.
దరఖాస్తు విధానం
1. అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in లోకి వెళ్లి Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
2. అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు సంఖ్య పొందాలి.
3. తాజా ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
4. రుసుము చెల్లించిన తర్వాత ధృవీకరణ పేజీని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
CTET పరీక్ష 132 నగరాల్లో,20 భాషల్లో నిర్వహించబడనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ప్రతి ఏడాది ఈ పరీక్షకు హాజరవుతుంటారు.
పరీక్షకు సంబంధించిన వివరాలు, సిలబస్, అర్హత ప్రమాణాలు, రుసుము, పరీక్ష నగరాల జాబితా వంటి అంశాలు త్వరలో విడుదల కానున్న సమాచారం బులెటిన్‌లో ఇవ్వబడతాయి.
CTET అర్హత పొందిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధమిక అర్హతగా పరిగణించబడుతుంది.
సీబీఎస్ఈ అధికారులు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సమాచారం చూసిఏవైనా ఫేక్ లింకులు, మోసపూరిత వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని సూచించారు.