ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAIలో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు వందలాది ఉద్యోగులను తొలగిస్తూ షాక్ ఇచ్చిన యాజమాన్యం, మరోవైపు కేవలం 20 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థికి ప్రతిష్టాత్మక విభాగానికి నాయకత్వం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కంపెనీకి ప్రాధాన్యమైన ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్ ట్రైనింగ్‌లో కీలకమైన డేటా యానోటేషన్ విభాగానికి ఇంత చిన్న వయస్కుడిని హెడ్‌గా నియమించడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.
బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ నెలలో దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులను పలు విడతల్లో తొలగించారు. తొలగింపులకు ముందు ఈ విభాగంలో సుమారు 1,500 మంది పని చేయగా, ఇప్పుడు సంఖ్య 900 మందికి తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా, తొలగింపులు ఆగిపోయాయని యాజమాన్యం హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే మరో 100 మందికి పైగా సిబ్బందిని తొలగించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగించింది. అంతేకాకుండా, తొమ్మిది మంది సీనియర్ ఉద్యోగుల స్లాక్ అకౌంట్లు డీయాక్టివేట్ చేయడం కూడా షాక్ ఇచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లోనే 20 ఏళ్ల డియాగో పాసినీని డేటా యానోటేషన్ బృందానికి కొత్త హెడ్‌గా నియమించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అయిన పాసినీ, ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ మరియు ఎకనామిక్స్ చదువుతున్నారు. కంపెనీ హ్యాకథాన్‌లో విజయం సాధించి మస్క్ దృష్టిని ఆకర్షించిన అతను కేవలం 8 నెలల క్రితమే xAIలో చేరారు. విద్యార్థి స్థాయి నుంచి నేరుగా నాయకత్వ స్థానంలోకి రావడం విశేషం. అంతకుముందు ఈ బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి టెస్లా ఆటోపైలట్ టీమ్‌ను పదేళ్లకు పైగా నడిపిన అనుభవజ్ఞుడు కావడం, ఈ మార్పుపై మరింత చర్చకు దారితీసింది.
పాసినీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొత్త విధానాలను ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఉద్యోగులతో వ్యక్తిగతంగా సమావేశాలు జరిపి, వారి పాత్రలు కంపెనీకి ఎంత ఉపయోగపడుతున్నాయో సమర్థించుకోవాలని కోరుతున్నారు. కొన్ని ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, ఆ ఫలితాల ఆధారంగా ఉద్యోగం కొనసాగించాలా వద్దా అని నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అతడిని అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రోత్సహించిన వారిని ఎలాన్ మస్క్ స్వయంగా ఫాలో అవడం, మరోవైపు అతని అర్హతలపై సందేహాలు వ్యక్తం చేసిన ఇద్దరు ఉద్యోగుల ఖాతాలను వెంటనే డీయాక్టివేట్ చేయడం కంపెనీలో వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఈ తొలగింపులు, నియామకాలపై ఇప్పటివరకు xAI అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా సందేహాలు రేకెత్తిస్తోంది.