అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక అనగానే గుర్తుకు వచ్చేది అంకుడు కర్రతో తయారు చేసే అద్భుతమైన హస్తకళలు. ఇక్కడి కళాకారులు రూపొందించే బొమ్మలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రధాని మోదీకి కూడా వీటి మీద మక్కువ ఉందని చెప్పుకోవాలి.
అయితే ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏటికొప్పాకకు చెందిన హస్తకళాకారుడు గుత్తి వాసు తన ప్రతిభను మరింత రుజువు చేశాడు. అంకుడు కర్రతో సహజ సిద్ధ రంగుల మేళవింపుతో జాతీయ పతాకం, రాఫెల్ యుద్ధ విమానం, క్షిపణిలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అంతేకాక శాంతికి చిహ్నంగా నిలిచేలా రెండు పావురాలను జాతీయ పతాకం పక్కన ఏర్పాటు చేశాడు.
బీఈడీ వరకు చదువుకున్న వాసు, చిన్నతనం నుంచే తన తండ్రి సూరిబాబు వద్ద ఈ హస్తకళల పాఠాలు నేర్చుకున్నాడు. విద్యతో పాటు హస్తకళలను జీవనవృత్తిగా మార్చుకున్న వాసు, ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు శ్రమించి ఈ కళాఖండాలను రూపొందించాడు. ఈ ప్రత్యేక హస్తకళలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని వాసు ఆకాంక్ష వ్యక్తం చేశాడు.