Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష!

Minister Narayana: అమరావతి నగరంలో మునిసిపాలిటీల అభివృద్ధి పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు.

Published : 2026-05-25 19:19:00

తాగునీరు, అండర్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలి : మంత్రి నారాయణ..

అమృత్ 2.0 పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చ..

అమరావతి నగరంలో మునిసిపాలిటీల అభివృద్ధి పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీల్లో అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఈఎన్సీ ప్రభాకర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అమృత్ 2.0, యూఐడీఎఫ్ (UIDF), ఏఐఐబీ (AIIB) పథకాల కింద చేపడుతున్న పనుల పురోగతిని మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇంటింటికీ తాగునీటి కొళాయిల ఏర్పాటు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, వాటర్ బాడీల అభివృద్ధి వంటి ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఇప్పటికే ప్రారంభమైన పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా కచ్చితమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న డిజైన్లను త్వరితగతిన ఖరారు చేసి పనుల్లో ఆలస్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో జాప్యం తగదని, అవసరమైన అనుమతులు, సాంకేతిక అంశాలను వేగంగా పూర్తి చేసి పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, శుద్ధమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య వ్యవస్థ, నీటి వనరుల సంరక్షణ వంటి అంశాల్లో దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

Spotlight

Read More →