Chandrababu: అమరావతికి చట్టబద్ధత.. కేంద్రానికి తీర్మానం! వచ్చే ఐదేళ్లలో అద్భుత నగరం ఖాయం.! మాది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం..

Chandrababu: విజయవాడ వేదికగా జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జర్నలిజం విలువలు, మీడియా బాధ్యతలపై కీలక ప్రసంగం చేశారు.

Published : 2026-03-28 22:28:00
  • "అబద్ధాల జర్నలిజం సమాజానికి ప్రమాదకరం": ఐజేయూ ప్లీనరీలో సీఎం చంద్రబాబు హితవు..
     
  • Politics: మంత్రుల క్వార్టర్ల స్థలాన్ని ప్రెస్ క్లబ్‌కు ఇచ్చాం: మీడియా పట్ల ప్రభుత్వ నిబద్ధత ఇదే!

Chandrababu: గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంతో పోల్చుకుంటే మీడియాలో విలువలు వేగంగా పడిపోతున్నాయని... విలువల పునరుద్దరణ జరిగేలా చూడాలని జర్నలిస్టులను సీఎం కోరారు. రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం ప్రమాదానికి దారితీస్తోందని అన్నారు. తమది జర్నలిస్ట్  ఫ్రెండ్లీ ప్రభుత్వమని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తి మేరకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రికి ఐజేయూ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 

సీనియర్ జర్నలిస్టులను సీఎం అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీని జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయని ఐజేయూ ప్రతినిధులు చెప్పడం సంతోషంగా ఉంది. ప్రస్తుత కాలంలో జర్నలిజం బాగా మారిపోయింది. మీడియా విపరీత పోకడలు సమాజానికి మంచిది కాదు. అలవోకగా అబద్ధాలను చిత్రీకరిస్తున్నారు. మీడియాలో విలువలు, సిద్దాంతాలు పడిపోతున్నాయి. దీన్ని పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే నాపై తప్పుడు వార్తలు రాశారు. మొదట వైఎస్ వివేకా మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు. పోస్టు మార్టానికి ఆదేశించడంతో అసలు విషయాలు బయటపడేసరికి హత్య నెపాన్ని నాపై మోపారు. నారాసుర రక్త చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టి సాక్షిలో తప్పుడు వార్త రాశారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగ్గకుండా నియంత్రించేలా జర్నలిస్టులు కృషి చేయాలి”అని సీఎం చంద్రబాబు అన్నారు.

మాది మీడియా ఫ్రెండ్లీ ప్రభుత్వం
“మాది మీడియా ఫ్రెండ్లీ ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో గత ఐదేళ్లలో చూశాం. పాజిటివ్ న్యూస్ ఇవ్వమని కోరడం లేదు. ప్రొగ్రెసివ్ న్యూస్ ఇవ్వాలని మీడియాను కోరుతున్నా. మంచిని, శాంతిని, అభివృద్ధిని ప్రమోట్ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీడియానే ప్రపంచానికి తెలియచేయాలి. రాష్ట్రాభివృద్ధిలో మీడియా తగిన పాత్ర పోషించాలి. ఇవాళ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్దత కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. వచ్చే ఐదేళ్లల్లో అమరావతిలో అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు. అలాగే వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతోందని దాన్ని జర్నలిస్టులు అధ్యయనం చేసి విశ్లేషించాలి. రాష్ట్ర రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24 మధ్య కాలంలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది. గత ఐదేళ్లల్లో జరిగిన వ్యవహరాన్ని మీడియా అంతా చూసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అన్నారు. ఏది పడితే అది చేశారు. ఏది పడితే అది మాట్లాడారు. వీటిని కొన్ని సందర్భాల్లో మీడియా తప్పు పట్టింది. తాము చేసిన తప్పులను ఎత్తి చూపే మీడియాను కంట్రోల్ చేయడానికి నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 2430 తెచ్చింది. సోషల్ మీడియా ఇప్పుడు అతి పెద్ద సమస్యగా ఉంది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీన్ని నియంత్రించేలా జర్నలిస్టులు చొరవ తీసుకోవాలి.”అని సీఎం చంద్రబాబు సూచించారు.

జర్నలిస్టుల సంక్షేమం చూసే బాధ్యత మాది
“ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైంది. జర్నలిస్టులకు నాడు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు కూడా చేశాం. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే విచారణకు జిల్లాలో ఎస్పీ స్థాయిలో కమిటీ విచారించేలా నిబంధనలు తెచ్చాం. 2014 తరువాత డెస్క్ జర్నలిస్టులకు, సబ్ ఎడిటిర్లకు అక్రిడేషన్లు, బస్సు ప్రయాణంలో రాయితీలు కల్పించాం. 2014-19 మధ్య జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించగా గత ప్రభుత్వంలో తీసేశారు. మేము 2018లో 20 వేల అక్రిడేషన్లు ఇస్తే... గత ప్రభుత్వం వాటిని సగానికి తగ్గించింది. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తాం. హైదరాబాద్ లో మంత్రుల క్వార్టర్ల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్రెస్ క్లబ్ కు ఇచ్చాం. అమరావతిలో ఐజేయూ కార్యాలయానికి స్థలం ఇచ్చే అంశాన్ని సబ్ కమిటీకి అప్పజెబుతాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Spotlight

Read More →