Cinema- రవేగంగా కల్కి సీక్వెల్.. జూలై నుండి ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ పక్కా ప్లాన్!
సింగ్ గీతం ప్రమోషన్లలో నాగ్ అశ్విన్ సంచలన కామెంట్స్.. !
2027 లోనే 'కల్కి 2' రిలీజ్? ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు సరికొత్త సంతోషాన్నిచ్చే క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. గతేడాది సంచలన విజయం సృష్టించిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ అయిన 'కల్కి 2' షూటింగ్‌కు సంబంధించిన కీలక వివరాలను దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన 'సింగ్ గీతం' చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న నాగ్ అశ్విన్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కల్కి 2' అప్‌డేట్‌ను పంచుకున్నారు.
'కల్కి 2' చిత్రానికి సంబంధించిన ప్రాథమిక షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అయితే, వచ్చే నెల (జూలై) నుండి ప్రభాస్‌తో కలిసి నాన్-స్టాప్‌గా (కంటిన్యూగా) భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సీక్వెల్‌ను అత్యంత శరవేగంగా పూర్తి చేసేలా చిత్రబృందం అన్ని సన్నాహాలు సిద్ధం చేసుకుందని, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు, ఎందుకంటే జూలై నుండి సినిమా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుకోనుంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో డైరీ మొత్తం బిజీగా మార్చుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' 2027 మార్చి 5న విడుదల కానుండగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రం ఇప్పటికే చివరి దశ షూటింగ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2' షూటింగ్ కూడా జూలై నుండి నాన్-స్టాప్‌గా సాగితే, ఈ చిత్రం 2027 లోనే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి 2027లో ప్రభాస్ నుండి రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను పలకరించడం ఖాయంగా మారడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పండుగ చేసుకుంటున్నారు.