ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ మంత్రి నారా లోకేష్ లండన్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. రాబోయే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కు ముందు భాగంగా ఈ పర్యటన చేపడుతున్నారు. ఇందులో ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమల విస్తరణకు దోహదం చేసే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు.
ఈ పర్యటనలో మంత్రి నారా లోకేష్‌తో పాటు రాష్ట్ర పరిశ్రమల విభాగం డైరెక్టర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మా రంగాలలో బ్రిటన్ అనుభవాన్ని సమీక్షించి, ఆ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అవకాశాలపై చర్చలు జరగనున్నాయి. లండన్‌లోని విద్యాసంస్థలు, ఆరోగ్య రంగానికి చెందిన ప్రముఖ కేంద్రాలు, ఫార్మా పరిశ్రమల ప్రతినిధులతో లోకేష్ భేటీ కావాలని షెడ్యూల్ సిద్ధమైంది.
విశాఖపట్నంలో జరగబోయే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏపీ అభివృద్ధికి కీలక మలుపుగా నిలవనుంది. అందుకే ఈ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు దేశాల అనుభవాలను అధ్యయనం చేస్తోంది. ఈ పర్యటన ద్వారా బ్రిటన్‌లోని పరిశ్రమల వ్యూహాలు, పెట్టుబడి అవకాశాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకొని, వాటిని ఏపీలోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో ఇప్పటికే ఐటీ, విద్య, హెల్త్, ఫార్మా రంగాలకు విశాఖపట్నం, అమరావతి, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లండన్ పర్యటన ఆ దిశగా మరింత బలాన్ని చేకూరుస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. భాగస్వామ్య దేశాలతో నేరుగా చర్చలు జరిపి, పెట్టుబడుల దారులు సులభతరం చేయడం ద్వారా పరిశ్రమల విస్తరణతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ఈ పర్యటనను ఏపీ భవిష్యత్ అభివృద్ధికి మైలురాయిగా చూస్తున్నారు.