ఈ రోజుల్లో మన రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లదే రాజ్యం. ఇప్పుడు కాలుష్యం, పెట్రోల్ ధరల వల్ల చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా, పెట్రోల్ స్కూటర్ కొనాలా అని ఆలోచిస్తున్నారు.
"ఏది కొంటే మనకు లాభం?", "ఏది మన జేబుకు అనుకూలంగా ఉంటుంది?" అనే ప్రశ్నలు చాలామందికి వస్తుంటాయి. ధర, నిర్వహణ, మైలేజ్ వంటి అంశాలను బట్టి మనం ఏ స్కూటర్ కొంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ చౌకైన ఎంపికను కోరుకుంటారు.
కానీ మనం ఒక స్కూటర్ కొనేటప్పుడు దాని మైలేజ్, నడిపే ఖర్చు, స్కూటర్ ధర, సర్వీస్, నిర్వహణ వంటి విషయాలను కూడా గమనించాలి. ఈ అంశాలను బట్టి మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఒక స్కూటర్‌పై మనం రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నామని అనుకుందాం. అంటే ఒక నెలలో 900 కిలోమీటర్లు అవుతుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్:
1 యూనిట్ విద్యుత్ ధర రూ.10 అనుకుంటే, స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి 5 యూనిట్లు తీసుకుంటే మొత్తం ఖర్చు రూ.50 అవుతుంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే అది 100 కిలోమీటర్లు వెళ్తుందని అనుకుందాం. అంటే ఒక కిలోమీటర్‌కు 0.50 పైసలు ఖర్చవుతుంది.
ఒక నెల మొత్తం (900 కిలోమీటర్లకు) ఖర్చు రూ.450 మాత్రమే అవుతుంది.
సంవత్సరానికి మొత్తం ఖర్చు రూ.5,400. దీనికి వార్షిక నిర్వహణ ఖర్చు రూ.2,000 కలిపితే, సంవత్సరానికి రూ.7,400 అవుతుంది.
పెట్రోల్ స్కూటర్:
పెట్రోల్ ధర లీటరుకు రూ.100 అనుకుందాం. ఒక పెట్రోల్ స్కూటర్ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అనుకుంటే, ఒక కిలోమీటర్‌కు రూ.2 ఖర్చవుతుంది.
ఒక నెల మొత్తం (900 కిలోమీటర్లకు) ఖర్చు రూ.1,800 అవుతుంది.
సంవత్సరానికి మొత్తం ఖర్చు రూ.21,600. దీనికి వార్షిక నిర్వహణ ఖర్చు రూ.2,000 కలిపితే, సంవత్సరానికి రూ.23,600 అవుతుంది.
ఈ లెక్కలు చూస్తుంటే పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుందని స్పష్టమవుతుంది.
5 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చును కూడా లెక్కించుకోవాలి.
ఒక పెట్రోల్ స్కూటర్ సగటు ధర రూ.75,000 అనుకుంటే, 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చు (ధర+నడిపే ఖర్చు) రూ.1,93,000 అవుతుంది.
ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సగటు ధర రూ.1,20,000 అనుకుంటే, 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చు (ధర+నడిపే ఖర్చు) రూ.1,57,000 అవుతుంది.
ఈ లెక్కల ప్రకారం, 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై దాదాపు రూ.36,000 ఆదా చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీకి 3 నుంచి 5 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఆ తర్వాత కొత్త బ్యాటరీ ప్యాక్‌ను కొనుగోలు చేయడానికి రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది.
మొత్తానికి, రోజువారీ తక్కువ దూరం ప్రయాణించేవారికి, కాలుష్యం గురించి పట్టించుకునే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక మంచి ఎంపిక. కానీ ఎక్కువ దూరం ప్రయాణించేవారు, ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత గురించి ఆలోచించుకోవాలి. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని మీ అవసరాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.