Prajavedhika: లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్లతో రూ.75 లక్షల మోసం చేసిన వ్యవహారంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

Prajavedhika: గుంటూరుకు చెందిన సూర్య ప్రసాద్ రావు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. కోటిరెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత వ్యాపారం కొరకు పెట్టుబడి పెట్టడం జరిగింది.

Published : 2026-05-21 20:23:00
  • Politics: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..
     
  • వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ స్టేట్ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు..

Prajavedhika: గుంటూరుకు చెందిన సూర్య ప్రసాద్ రావు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. కోటిరెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత వ్యాపారం కొరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అందులో భాగంగా సుమారు రూ. 75 లక్షల మొత్తాన్ని పెట్టుబడిగా సమకూర్చాను. ఈ క్రమంలో సదరు భాగస్వామి ఒక డాక్టర్ కలిసి మంగళగిరి ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలిసింది. తాను పెట్టిన పెట్టుబడి డబ్బుల గురించి, వ్యాపార లావాదేవీల గురించి నిలదీయగా.. సదరు కోటిరెడ్డి, మంగళగిరికి చెందిన సదరు డాక్టర్ తీవ్రంగా స్పందించారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని నేరుగా బెదిరింపులకు దిగారు. దీనిపై గతంలో పోలీసులను కూడా ఆశ్రయించిన ఎలాంటి న్యాయం జరగలేదు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో వీరు కోటిరెడ్డికి సంబంధించిన భూములు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. తన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాను. దీంతో వారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి గారి పేర్లు చెబుతూ.. "మా వెనుక అంతటి పెద్ద నాయకులు ఉన్నారు, మమ్మల్ని ఏమీ చేయలేవు" అని హెచ్చరించారు. అంతేకాకుండా సదరు నాయకుల అనుచరులను, మనుషులను పంపించి తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ స్టేట్ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ వనపర్తి వీరభద్రరావులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.

సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన గోవిందరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నంబర్ 650-2 లో గల 2 ఎకరాల భూమిని గతంలో ఎలక్ట్రీషియన్లుగా పనిచేసే తమకు కేటాయించడం జరిగింది. అయితే 2024 ఫిబ్రవరి నెలలో అప్పటి వైఎస్ఆర్సిపి నాయకులు, అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా ఈ భూమిని వేరే వాళ్లకు కట్టబెట్టారు. దీనిపై తాము ప్రశ్నించగా... "మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఈ భూమి మీ పేరు మీద ఉంచుతాం, లేదంటే ఇవ్వం" అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, కండువా కప్పుకోవడానికి నిరాకరించిన తమకు ఆ భూమి దక్కకుండా అన్యాయం చేశారు. దీనిపై స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాం. తమ పోరాటానికి దిగివచ్చిన రెవెన్యూ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా వేరే వాళ్లకు ఇచ్చిన ఆ పట్టాను రద్దు చేశారు. అక్రమ పట్టా రద్దయినప్పటికీ ఆ 2 ఎకరాల భూమిని ఇప్పటివరకు అసలైన లబ్ధిదారులైన తమకు తిరిగి అప్పగించలేదు. అధికారులు కాలయాపన చేస్తూ భూమిని తమ ఆధీనంలోకి ఇవ్వడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి వెంకటలక్ష్మణరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..సర్వే నెం. 1588లో తమకు 19.72 సెంట్లు వారసత్వ భూమి కలదు. ఈ భూమిపై తమకు పూర్తి హక్కులు ఉండి దశాబ్దాలుగా తమ ఆధీనంలో సాగు చేసుకుంటున్నాము. అయితే ఇటీవల సి.పి.ఎం పార్టీకి చెందిన తెల్లం రామకృష్ణ ఆధ్వర్యంలో పూనెం వీరాస్వామి, పూనెం శేఖర్, కరిగితి కన్నయ్య, పొట్టేలు పాపమ్మ, సోయం సోమమ్మ, కోర్స విజయలక్ష్మి, మరికొందరు గిరిజనులు ఏకమై తమ భూమిలోకి దౌర్జన్యంగా చొరబడ్డారు. తాము ఎంతో ఖర్చు పెట్టి పెంచిన జామాయిల్ పంటను అక్రమంగా నరికివేసి తమకు భారీ నష్టం కలిగించారు. అంతేకాకుండా ఆ భూమిని ట్రాక్టర్లతో దున్ని, అందులో అపరాలు చల్లి, భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ బలాన్ని చూపుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమ సొంత భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా మమ్మల్ని ప్రాణభయానికి గురిచేస్తున్నారు. కావున వారిపై  చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన పచ్చల లక్ష్మీనారాయణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 31/3 లో నలుగురు అన్నదమ్ములకు వారసత్వంగా వచ్చిన 1 ఎకరా 18 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించిన రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్‌లో స్పష్టంగా నమోదై ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష (రీ సర్వే) లో ఈ భూమి విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. కొత్త సర్వే ప్రకారం కేవలం 0.98 సెంట్లు (ఒక చోట 0.92 సెంట్లు, గుడిమీరు కట్ట వద్ద విడిగా ఉన్న 0.06 సెంట్లు కలిపి) మాత్రమే రికార్డుల్లో చూపించారు. దీనివల్ల అసలు భూమి కంటే 0.20 సెంట్లు తక్కువగా నమోదైంది. తమ భూమి తగ్గడానికి ప్రధాన కారణం పక్కనే ఉన్న సరిహద్దు దారుల భూమిని (రీ సర్వే నెం 31/02 తప్పుగా కొలవడమే. అక్కడ ఉండాల్సిన 0.87 సెంట్లకు గాను, రికార్డుల్లో పొరపాటున 1.00 ఎకరాగా నమోదు చేస్తూ, 0.13 సెంట్లు అదనంగా కలిపారు.  మిగిలిన 0.07 సెంట్లు సర్వే నెంబర్ 31/4 లో కలిసిపోయింది. రీ సర్వే అధికారుల పొరపాటు వల్ల తమకు దక్కాల్సిన 0.20 సెంట్లు భూమి పక్కవారైనా సరిహద్దు దారుల ఆక్రమణలోకి వెళ్లిపోయింది. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాము. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మధుసూదన బాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెం. 1256 లో తమకు సుమారు 8.20 సెంట్లు భూమి కలదు. ఈ భూమి తమ పూర్వీకుల నుండి తమకు వారసత్వంగా సంక్రమించిన సొంత భూమి. గత రెండు మూడు సంవత్సరాల నుండి బుట్టాయిగూడెం రెవెన్యూ పరిధిలోని పద్మవారిగూడెం గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు మమ్మల్ని తమ సొంత భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. మమ్మల్ని వ్యవసాయం చేసుకోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా, తాము ఎంతో కష్టపడి పండించిన జామాయిల్ పంటను సైతం వారు అక్రమంగా నరుక్కుని పట్టుకుపోతున్నారు. ప్రస్తుతం కూడా వారు ఆ భూమిని ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతున్నారు. తమ సొంత భూమిలోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా దౌర్జన్యం చేస్తూ తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారు. కావున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

బాపట్ల జిల్లా రేపల్లే మండలం గుడ్డికాయలంక గ్రామానికి చెందిన పార్ధసారధి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమకు గ్రామానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో సాగులో ఉన్న మాగాని వ్యవసాయ భూమి ఉంది. అయితే గతంలో జగనన్న ఇళ్ల స్థలాల పథకం కింద సేకరించే భూముల జాబితాలో ఈ భూమిని చేర్చి, రెవెన్యూ రికార్డులలో 'హోల్డ్' లో పెట్టారు. దీనివల్ల భూమికి సంబంధించిన ఆన్‌లైన్ రికార్డులైన 1B (వన్-బి), అడంగల్ రాకుండా నిలిచిపోయాయి. దీనివల్ల తన సొంత భూమిపై హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కావున వారిపై చర్యలు తీసుకోని ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో సదరు భూమిని క్షుణ్ణంగా విచారణ చేసి, అది ఇళ్ల స్థలానికి పనికొచ్చే భూమి కాదని సాగులో ఉన్న ఉత్పాదక మాగాని వ్యవసాయ భూమి అని నిర్ధారించాలని వేడుకున్నాడు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన రామకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమకు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో తన పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన భూమి ఉంది. మొత్తం 8 సర్వే నంబర్లలో కలిపి సుమారు 16 ఎకరాల భూమి తమ ఆధీనంలో ఉంది. అయితే ఈ భూమిని రెవెన్యూ రికార్డులలో పొరపాటున ‘చుక్కల భూమి’22A కింద చేర్చారు. ఈ తప్పును సరిదిద్ది, తనకు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ గత 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ భూమిపై తనకు ఉన్న పూర్తి హక్కులను నిరూపించే అన్ని రకాల అసలు సర్టిఫికేట్లు, పత్రాలను జతపరిచి కొండాపురం తాసిల్దార్ గారికి సమర్పించాం. అంతేకాకుండా ఆర్డీఓ కావలి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా పలుమార్లు "స్పందన" కార్యక్రమాల్లో అర్జీలు సమర్పించాం. అయినా ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →