ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. రైతులు ఎరువుల బస్తాల కోసం ఎక్కడికక్కడ తిప్పలు పడ్డారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటల సాగు సమయంలో యూరియా డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఏపీ ప్రభుత్వం యూరియా బస్తాలను సమకూర్చినా, కొందరు రైతులు మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల పరిస్థితి మరింత క్లిష్టమైంది. అధిక యూరియా వాడితే పంట దిగుబడి పెరుగుతుందనేది చాలామంది రైతుల్లో నెలకొన్న అపోహ అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. పంటల పెరుగుదలలో మైక్రో న్యూట్రియెంట్స్ కీలకమని, యూరియా పరిమిత వాడకం వ్యవసాయానికి మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రతి బస్తా తగ్గించినందుకు రూ.800 ప్రోత్సాహకంగా అందిస్తామని సీఎం ప్రకటించారు.
రబీ సీజన్ ప్రారంభానికి ముందు యూరియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఈసారి యూరియా పంపిణీ పూర్తిగా డిజిటల్ విధానంలో, పద్ధతి ప్రకారం జరుగనుంది. రైతుల ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ జరిపి, వారి పంటకు అవసరమైన యూరియా పరిమాణాన్ని నిర్ణయిస్తారు. పంట అవసరాన్ని బట్టి యూరియా మూడు విడతల్లో రైతులకు అందిస్తారు. ఈ విధానం ద్వారా రైతులు మోతాదుకు మించి యూరియా తీసుకెళ్లకుండా నియంత్రణ ఉంటుంది. ఖరీఫ్‌లో ఇలాంటి విధానం లేకపోవడం వల్ల కొందరు రైతులు అధికంగా యూరియా తీసుకుని నిల్వ చేసుకోవడం, దుర్వినియోగం చేయడం జరిగినందున ప్రభుత్వం ఈసారి జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ రబీ సీజన్ నుంచి యూరియా పంపిణీకి ఈ-పంట వివరాలు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. రైతు ఏ పంట సాగు చేస్తున్నాడో, ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఎంత యూరియా అవసరమో వ్యవసాయశాఖ అధికారులు ఈ-పంట రికార్డుల ఆధారంగా నిర్ధారిస్తారు. దీని వల్ల సరైన రైతుకే సరైన పరిమాణంలో యూరియా చేరుతుంది. దుర్వినియోగం, అక్రమ విక్రయాలు పూర్తిగా అరికట్టే అవకాశం ఉంటుంది. రైతు ఏ పంట కోసం ఎంత యూరియా తీసుకున్నాడో కూడా రికార్డుగా ఉండడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. పంటకు అవసరమైన ఎరువులు సమయానికి అందడం, దిగుబడి నాణ్యత మెరుగుపడడం ప్రధాన లక్ష్యం.
రబీ సీజన్‌కి ముందే రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కోసం ఈ-పంట నమోదు గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది. ఈ నెల 30 వరకు సవరణలు, సామాజిక తనిఖీ జరగనుంది. తుది జాబితా అక్టోబర్ 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది. అధికారులు రైతులను సమయానికి నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ-పంట రిజిస్ట్రేషన్ లేకపోతే యూరియా పంపిణీతో పాటు ప్రభుత్వ పథకాలు, బీమా డబ్బులు కూడా అందకపోవచ్చు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాబోయే రబీ సీజన్లో ఎరువుల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.