India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్!

India Trip: అమెరికాకు చెందిన అలెక్స్‌, అమీలియా అనే దంపతులు భారత్‌లో చేసిన నెల రోజుల పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Published : 2026-05-31 16:16:00

లగ్జరీ ట్రిప్‌తో వైరల్ అయిన అమెరికన్ జంట ఖర్చుల కథ..

30 రోజులు.. 13 నగరాలు.. రూ.10 లక్షల ఖర్చు..

అమెరికాకు చెందిన అలెక్స్‌, అమీలియా అనే దంపతులు భారత్‌లో చేసిన నెల రోజుల పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 30 రోజుల పాటు 13 భారతీయ నగరాల్లో పర్యటించిన ఈ జంట తమ ట్రిప్‌కు మొత్తం 10,605 డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశామని వెల్లడించారు. ఈ వివరాలను వారు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

“భారత్‌లో 30 రోజుల ట్రిప్‌కు మేము మొత్తం 10,605 డాలర్లు ఖర్చు చేశాం. రోజుకు సగటున 354 డాలర్లు ఖర్చయింది” అని వారు తమ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ మొత్తం తమకే ఊహించని స్థాయిలో ఎక్కువగా అనిపించిందని కూడా చెప్పారు.

ఈ భారీ ఖర్చుకు ప్రధాన కారణం ప్రయాణ సౌకర్యాలేనని అలెక్స్‌, అమీలియా వెల్లడించారు. 30 రోజుల్లో 13 నగరాలు తిరగడం వల్ల ఎక్కువ సమయం ప్రయాణాలకే వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ట్రిప్‌లో వారు ఆరు విమాన ప్రయాణాలు, ఆరు ప్రైవేట్ కార్ ప్రయాణాలు, రెండు రైలు ప్రయాణాలు చేసినట్లు వివరించారు.

అంతేకాకుండా, తాము బడ్జెట్ ట్రావెల్ కంటే లగ్జరీ ట్రావెల్‌నే ఎంచుకున్నామని చెప్పారు. మంచి హోటళ్లలో ఉండడం, ప్రీమియం అనుభవాలను ఆస్వాదించడం వల్ల ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో రాత్రికి హోటల్ ఖర్చు సుమారు 127 డాలర్లు (దాదాపు రూ.12 వేల పైగా) అయ్యిందని తెలిపారు.

“భారత్‌లో ఉండటం చాలా చౌక అని చాలామంది చెబుతారు. కానీ బడ్జెట్ ఆప్షన్లను కాకుండా మంచి హోటళ్లు, నాణ్యమైన ఆహారం, ప్రత్యేక అనుభవాలు కోరుకుంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది” అని వారు వివరించారు. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ కోసం బయటే తినడం కూడా ఖర్చును పెంచిందని చెప్పారు.

తమ ఖర్చుల లెక్కలు చూసిన తర్వాత తామే ఆశ్చర్యపోయామని ఈ జంట పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఒక నెలలో అంత డబ్బు ఖర్చు పెట్టారంటే నిజంగానే రాజుల్లా జీవించారు” అని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, మరొకరు “మీరు ఏడాది ప్రయాణం కోసం ముందే లక్ష డాలర్లు సేవ్ చేసుకున్నామని మీ ప్రొఫైల్‌లో ఉంది, కాబట్టి మీరు ఖర్చు తగ్గించుకోవడానికి ట్రావెల్ చేయడం లేదని అర్థమవుతోంది” అని అన్నారు.

ఇంకొక నెటిజన్ “భారత్‌లో బ్యాక్‌ప్యాకర్‌లా తిరిగితే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కానీ మంచి హోటళ్లు, నాణ్యమైన భోజనం, ప్రత్యేక అనుభవాలు కోరుకుంటే ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ధరలు బాగా పెరిగాయి” అని అభిప్రాయపడ్డారు.

మరో వ్యక్తి అయితే “నేను భారత్‌లో రెండు నెలలు తిరిగి మొదటి నెలలో 500 డాలర్లు, రెండో నెలలో 700 డాలర్లు మాత్రమే ఖర్చు చేశాను. మీరు చేసిన ఖర్చు చాలా ఎక్కువ” అంటూ కామెంట్ చేశారు. ఈ ఘటనతో భారత్‌లో పర్యటన ఖర్చులు పూర్తిగా వ్యక్తిగత ఎంపికలపై ఆధారపడి ఉంటాయనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

Spotlight

Read More →