రచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831
ఎరుమేలి
శబరిమల తీర్థయాత్రలో ముఖ్యమైన మజిలీ ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం అనేక విషయాలలో ప్రసిద్ది చెందింది. శ్రీ ధర్మ శాస్తా దేవాలయానికి చాలా దగ్గరలో ఒక మసీదు కూడా ఉంది. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీక అయిన ఈ రెండు దేవాలయాలలో పూజలు చేసి 'పేటతుళ్ళి' ఆడిన తర్వాత యాత్రికులు శబరిమల వెళ్తారు. పేటతుళ్ళి ఆడకుండా శబరిమల యాత్ర చేయడం సాంప్రదాయలకు విరుద్ధం. ఎరుమేలి ఆలయం కేరళ రాష్ట్రం కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో ఆగ్నేయ భాగంలో మణిమల నదీ తీరాన "ఎరుమేలి" అనే పట్టణం ఉంది. ఎరుమేలి కొట్టాయం పట్టణానికి 49 కిలోమీటర్ల తూర్పున, కేరళ రాజధాని త్రివేండ్రంకు 133 కిలోమీటర్ల దూరంలో శబరిమల మార్గంలో ఉంది. ఈ ఎరుమేలి అయ్యప్ప స్వామి వారి చరిత్రతో మరియు పురాణాలలో బలమైన మూలాలను కలిగి ఉన్న ప్రదేశం.
మండల కాలం పాటు భక్తిశ్రద్ధలతో కఠిన దీక్ష చేసిన అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకుని స్వామివారి దర్శనానికి శబరిమల బయలుదేరుతారు. 41 రోజుల దీక్ష ఫలితం మొత్తం ఇరుముడిలో ఉంటుంది. అయితే శబరిమలై యాత్ర ఎరుమేలితోనే మొదలవుతుంది. ఎరుమేలిలో వావరు స్వామిని భక్తులు దర్శించుకొంటారు. ముస్లిం యువకుడైన వావరు ఓ బందిపోటు. పులిపాల కోసం అయ్యప్ప అడవికి వెళ్లినపుడు అడ్డగించిన వావరుడు అనంతరం స్వామికి ప్రియ భక్తుడిగా మారిపోయాడు. నా దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారని వావరుకి అయ్యప్ప వరమిచ్చాడు. ఎరుమేలిలో వావరుస్వామి కొలువున్నది కూడా ఒక మసీదే. మసీదులో వావరుస్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణం చేసిన తర్వాత అయ్యప్ప భక్తులు శరీరానికి రంగులు పూసుకుని, రకరకాల వేషధారణలతో పేటతుళ్ళి ఆడుతారు.
మహిషి సంహారం తర్వాత అయ్యప్ప చేసిన తాండవమే ఈ పేటతుళ్ళి. ఇలా వావరు మసీదు నుంచి భక్తులు తన్మయంతో నాట్యం చేస్తూ ధనుర్బాణధారియైన ధర్మశాస్తా అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడిని కన్నెమూల గణపతి అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు. ఇది హిందూ-ముస్లిం ఐక్యతకు ఓ చిహ్నం. అంతేకాదు భక్తులంతా ఒంటికి రంగులు పూసుకుని పేటతుళ్ళి ఆడటంలో ఓ పరమార్థం ఉంది. రాజు, పేద, కుల, మత, జాతి అనే భేదాలు మరిచి, ఆనందంతో తాండవం చేయడమంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే.
శబరిమల తీర్థయాత్ర చేస్తున్న హిందువులందరూ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి వారికి రెండు దేవాలయాలు ఉన్నాయి. వీటిని వాలియంబలం అని, మరొకటి కొచ్చంబలం అని పిలుస్తారు. రెండు దేవాలయాలు అర కిలోమీటరు దూరంలో ఉన్నాయి. శబరిమల తీర్థయాత్రలో పేటతుళ్ళి వాలియంబలం మరియు కొచ్చంబలం సమీపంలో నిర్వహిస్తారు. ఎరుమేలి 'వావర్ మసీదు' కూడా ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయంలో యాత్రికులకు వసతి, ఆహారం, నీరు వంటి సదుపాయాలు ఉన్నాయి, వీటిని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్వహిస్తోంది. ఇక్కడి ఆలయ తాంత్రిక హక్కులను 'తాజ్మోన్ మఠం' కలిగి ఉంది.
వాలియా అంబలం (పెద్ద ఆలయం) స్థానిక రాజు రన్నీ వద్ద పనిచేసిన ఒక అధికారి అలంబిల్లిల్ మిల్లక్కరన్ నిర్మించినట్లు భావిస్తున్నారు. అలంబిల్లిల్ మిల్లక్కరన్ తిరువంబాడి ఆలయ ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లి, అక్కడి ఆలయ అధికారులచే అవమానించబడి దర్శనానికి నోచుకోలేదు. దర్శనం చేసుకోలేక పోయినందుకు మిల్లక్కరన్ ఎంతో బాధ పడ్డాడు. ఆరోజు రాత్రి ఒక కలలో ఒక సాధువు ఉదయాన్నే పవిత్రమైన పంబా నదికి వెళ్లి, స్నానం చేయమని, అక్కడ అయ్యప్ప విగ్రహాన్ని దర్శిస్తావని చెప్పాడు.
మరుసటి రోజు అలంబిల్లిల్ మిల్లక్కరన్ పంబా నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. కలలో సాధువు చెప్పినట్లుగానే అతనికి పంబా నదిలో అయ్యప్ప స్వామి వారి విగ్రహం కనిపించింది. దాన్ని తన ఇంటికి తీసుకువచ్చి పూజలు చేయడం మొదలు పెట్టాడు. సాధువు మరోసారి మిల్లక్కరన్ కలలోకి వచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో ధాన్యం పండించమని, అవి పండిన తర్వాత ఆ ధాన్యం తినడానికి ఒక ఆవును పంపమని చెప్పాడు. ధాన్యాన్ని తిన్న తర్వాత ఆవును స్వేచ్చగా వదిలి, ఆవును అనుసరించమని ఆదేశించాడు. ఆవు విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని ఆ సాధువు ఆదేశించాడు. అలా నిర్మించినదే ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం. ఈ ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహమే అలంబిల్లిల్ మిల్లక్కరన్ కు పంబా నదిలో దొరికింది.
వావరు మసీదు కొచ్చంబలం ఎదురుగా ఉంది. అయ్యప్ప స్వామిని సందర్శించే ముందు భక్తులు మసీదులో వావరు స్వామిని దర్శిస్తారు. వావరును అయ్యప్ప సహచరుడిగా భావిస్తారు. శతాబ్దాల క్రితం తమిళనాడు నుండి వలస వచ్చిన వెల్లాలా కుటుంబం ఇప్పటికీ ఇక్కడ 'పుథెన్వీడు' అనే చిన్న మట్టి గుడిసెను సంరక్షిస్తుంది. 15 ఏళ్ల అయ్యప్ప మహీషిని చంపిన ఆ గుడిసెలోనే రాత్రి బస చేసినట్లు చెబుతారు. ఈ గుడిసె దాదాపు 1000 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయ్యప్ప మహిషిని చంపడానికి ఉపయోగించినట్లు భావిస్తున్న ఒక కత్తిని గుడిసెలోని ఒక చిన్న పూజ గదిలో ఉంచారు. అలప్పుజలోని చీరపంచిరలోని అయ్యప్ప యొక్క 'కలరి' గురువు, పూంకుడి పూర్వీకుల ఇంటిలో కూడా ఇలాంటి కత్తి ఉంది.
రెండు మతాల ప్రజలు ఒకే సమయంలో ప్రార్థనలు చేసే ప్రార్థనా స్థలాన్ని ప్రపంచంలో మరెక్కడా చూడలేరు. మకరవిలక్కు సమయంలో, అయ్యప్ప భక్తులతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోతుంది. ఆ సమయంలో కూడా ముస్లింలు తమ రోజువారీ ఐదు ప్రార్థనలు ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించుకోవడం విశేషం.
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం!
యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!
యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!
యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?
యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?
యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...
యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...