రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాల మరియు మత్స్య శాఖల మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు కేంద్ర టెక్స్టైల్స్ మంత్రివర్యులు శ్రీ గిరిరాజ్ సింగ్ గారికి లేఖ రాశారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా, 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని పేర్కొన్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘మొంథా తుఫాన్’ కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, దాంతో రైతులు తమ పంటను కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు అమ్మకానికి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సీఎం యాప్ (CM APP) మరియు ఆధార్ ఆధారిత ఈ–పంట (e-Crop) వ్యవస్థల ద్వారా పత్తి కొనుగోళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) ను సీఎం యాప్‌తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి, రైతులు కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యంగా, రైతుల వివరాలు కాపాస్ కిసాన్ యాప్ నుంచి సీఎం యాప్‌కు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చేయాలని, రైతులు తమ సమీప జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లులలో పత్తిని విక్రయించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అంతేకాకుండా, L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
అదనంగా, గుంటూరులో కాపాస్ కిసాన్ యాప్ కోసం ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలనీ, అలాగే తేమ శాతం 12 నుండి 18% వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని, వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు ఈ చర్యలు రైతులలో నెలకొన్న అసంతృప్తిని తగ్గిస్తాయని, పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని అన్నారు. సహజ విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం కేంద్రం బాధ్యత అని గుర్తుచేస్తూ, తక్షణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారిని ఆయన అభ్యర్థించారు. “రైతు కష్టానికి సరైన ప్రతిఫలం దక్కేలా రాష్ట్రం కట్టుబడి ఉంది. కేంద్రం కూడా ఈ సమస్యలో మనతో పాటు నిలబడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.