రోజుకు ఎనిమిది గ్లాసులు నీరు తాగాలి — ఈ వాక్యం మనం తరచూ వింటూ ఉంటా. కానీ ప్రతి మనిషి శరీర అవసరాలు ఒకేలా ఉండవు. వాతావరణం, శరీర శ్రమ, వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు నీటి అవసరాన్ని నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీటి తాగే విషయంలో ‘ఎక్కువ తాగితే మంచిందే’ అనే అపోహను వారు ఖండిస్తున్నారు.
తగినన్ని నీళ్లు తాగితే శరీరం సహజంగా శుభ్రపరిచే పనిని ప్రారంభిస్తుంది. చెమట, మూత్రం రూపంలో వ్యర్థాలు బయటకు పంపబడతాయి. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో నీరు చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయడానికి, చర్మం మెరుగ్గా ఉండటానికి, కండరాలు, కీళ్ల మోల్కీళ్ళ సాఫ్ట్‌నెస్‌కి నీటి పాత్ర కీలకం. నిపుణుల ప్రకారం నీరు ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు చేరేలా చేస్తుంది. నీరు సరైన స్థాయిలో ఉన్నప్పుడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది, ఏకాగ్రత, శక్తి స్థాయిలు పెరుగుతాయి.
నీరు తక్కువగా తాగితే శరీరం వెంటనే హెచ్చరికలు ఇస్తుంది. తలనొప్పి రావడం, అలసట, నీరసం అనిపించడం, చిరాకుగా మారడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి. మూత్రం రంగు ముదురుగా మారడం నీటి లోపానికి స్పష్టమైన సంకేతం అని వైద్యులు సూచిస్తున్నారు.
నీళ్లు తాగే సమయంపై కూడా నిపుణులు స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీటితో రోజు ప్రారంభిస్తే శరీరం శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమవుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన తరువాత నీరు తాగడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం చేస్తూ వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగించే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. రోజు వ్యాయామం చేసే వారికి చెమట ద్వారా ద్రవాలు కోల్పోతారు కాబట్టి తప్పనిసరిగా నీరు తాగాలని సూచిస్తున్నారు.
అయితే నీరు ఎక్కువగా తాగడమూ అంతే ప్రమాదకరం. అవసరానికి మించి నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోవడం వల్ల ‘వాటర్ ఇన్‌టాక్సికేషన్’ అనే ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. ఒకేసారి ఎక్కువగా నీరు తాగితే కిడ్నీలు అదనపు నీటిని బయటకు పంపడంలో ఇబ్బంది పడతాయి. గుండె, కిడ్నీ సమస్యలున్న వారు అయితే మరింత జాగ్రత్త పడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.