తెలంగాణలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పోలీసులు ఆమె నివాసానికి వెళ్లడం సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇటీవల సుమంత్‌ను పదవి నుంచి తొలగించగా, బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు జూబ్లీహిల్స్‌లోని సురేఖ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం ప్రకారం, సుమంత్ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. అయితే పోలీసులు వచ్చిన సమయానికి సురేఖ తన కారులో సుమంత్‌ను తీసుకెళ్లిపోయారని సమాచారం. రాత్రి సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రిగారి ఇంటికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన తర్వాత సురేఖ కుమార్తె సుస్మిత మీడియాతో మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తమ కుటుంబంపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. పార్టీ లోని రెడ్డి నాయకులు అందరూ కలిసి తన తల్లి వంటి బీసీ నాయకురాలిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. డెక్కన్ సిమెంట్స్ సమస్యను పరిష్కరించేందుకు రోహిన్ రెడ్డి కూడా సుమంత్‌తో మాట్లాడారని, అయితే పోలీసు చర్యల్లో రోహిన్ రెడ్డిని ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించింది.
సుస్మిత ఇంకా చెప్పింది, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని. వేమ్ నరేందర్ రెడ్డి గతంలో వరంగల్ ఈస్ట్‌లో ఎన్నికల్లో ఓడిపోయాడని, ఇప్పుడు రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలకు మద్దతుగా మాట్లాడుతుంటే, మరోవైపు బీసీ మంత్రులపై ఒత్తిడి తెస్తోందని ఆమె మండిపడింది.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం గమనార్హం. మేడారం గద్దెల ఆధునీకరణకు రూ.71 కోట్ల టెండర్లు పొంగులేటి కంపెనీలకు ఇవ్వడం సురేఖకు నచ్చలేదని ప్రచారం ఉంది. ఈ సంఘటనలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.