విశాఖపట్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ తన పెద్ద డేటా సెంటర్‌ను వైజాగ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడ్డా చివరికి ఆంధ్రప్రదేశ్ దాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయం వెనుక ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చురుకైన నిర్ణయాలు, ముఖ్యంగా ఐటీ మంత్రి నారా లోకేష్ చూపిన కృషి అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఇది పెద్ద అడుగు అని ఆయన అన్నారు.
ఇక ఈ విషయంపై ఇతర రాష్ట్రాల్లో మాత్రం అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ వైజాగ్‌కి గూగుల్ వెళ్లడానికి కారణం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భారీ రాయితీలే. ₹22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇచ్చారు. భూమిని 25% తగ్గింపు ధరకు ఇచ్చారు. నీరు, విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ కూడా 100% ఇస్తున్నారు అని అన్నారు.
ఆయన ఇంకా చెప్పారు ఈ రాయితీలన్నీ ఇచ్చి గూగుల్‌ను రప్పించారనే విషయం ప్రజలకు తెలపరు. గూగుల్ వచ్చింది అని మాత్రమే పత్రికల్లో చెబుతారు. ఇదే రాయితీలు మేము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నారంటారు అని వ్యాఖ్యానించారు.
దీనికి ప్రతిగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా సర్కాస్టిక్‌గా ట్వీట్ చేశారు. ఆయన రాశారు మన ఆంధ్రా భోజనం కారంగా ఉంటుందని అంటారు. ఇప్పుడు మన పెట్టుబడులు కూడా అంతే కారంగా అనిపిస్తున్నాయి! కొన్ని పొరుగురాష్ట్రాలు ఇప్పటికే దాని వేడిని అనుభవిస్తున్నాయి అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది యువత ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉన్నారు. దీని వల్ల వైజాగ్‌లో వేలాది ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని, ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కి కొత్త శకం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మధ్య సంతకం అయిన ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. కొందరు దీనిని స్మార్ట్ డెవలప్మెంట్”గా ప్రశంసిస్తుండగా మరికొందరు అతిగా రాయితీలు ఇచ్చారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా వైజాగ్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తోంది ఇది ఆంధ్రా అభివృద్ధికి కొత్త మైలురాయి అని చెప్పొచ్చు.