ప్రతిభ ఎవరి సొత్తు కాదని, కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ లేదని మరోసారి నిరూపించబోతున్నారు తెలంగాణ జానపద గాయని నాగదుర్గ. చిన్న వయసులోనే ప్రజా గీతాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. “దారిపొంటత్తుండు”, “నా పేరు ఎల్లమ్మ”, “ఎర్ర రుమాల్”, “కాపోళ ఇంటికాడ” వంటి పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించిన నాగదుర్గ, తన స్వరంతో గ్రామీణ జానపద సంస్కృతిని ప్రతిధ్వనింపజేశారు.
ఇటీవల ఆమె సినీ రంగంపై దృష్టి పెట్టారు. “కలివనం” అనే తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటించినప్పటికీ, ఆ సినిమా విడుదలపై స్పష్టత రాలేదు. ఈమధ్య బిగ్బాస్ తెలుగు 9వ సీజన్లో ఆమె పాల్గొంటారని వచ్చిన వార్తలు కూడా కేవలం పుకార్లేనని తేలింది. అయితే ఇప్పుడు ఆమె కెరీర్ కొత్త మలుపు తిరగబోతోంది.
తాజాగా తమిళ సినీ రంగంలో హీరోయిన్గా నాగదుర్గ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. పవీష్ “జాబిలమ్మ నీకు అంత కోపమా” అనే డబ్బింగ్ చిత్రంతో గత సంవత్సరం హీరోగా పరిచయమయ్యారు. ఆయన కొత్త సినిమా నాగదుర్గకు తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లే బంగారు అవకాశంగా మారనుంది.
ఈ సినిమా విజయవంతమైతే నాగదుర్గకు తమిళ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. గతంలో తెలుగు నటీమణులు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి వారు కూడా తమిళ సినిమాల్లో అవకాశాలు సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నాగదుర్గ కూడా చేరబోతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో స్థానిక నటీమణులు తగ్గుతున్న తరుణంలో, ఇతర భాషల్లోనైనా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలను అభిమానులు, సినీ ప్రముఖులు హర్షిస్తున్నారు. జానపద గాయకురాలిగా ప్రారంభమై, సినీ నటి దిశగా అడుగులు వేస్తున్న నాగదుర్గ ప్రయాణం ప్రేరణాత్మకంగా మారింది. తన శ్రమతో, ప్రతిభతో ఆమె తెలుగు ప్రజలకు గర్వకారణం అవుతారని అభిమానులు నమ్ముతున్నారు.