ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక సంస్కరణ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ "భిక్షాటన నివారణ (సవరణ) చట్టం – 2025"ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించగా, అక్టోబర్ 27న అధికారికంగా జీవో ఎంఎస్ నంబర్ 58ను విడుదల చేశారు. న్యాయశాఖ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో అమలు చేయనున్నారు. భిక్షాటన మాఫియాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, నిరుపేదలకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
పునరావాసం, ఉపాధిపై దృష్టి
ప్రభుత్వం ఈ చట్టాన్ని శిక్షారూపంలో కాకుండా, పునరావాస పథకంగా అమలు చేయనుంది. భిక్షాటన చేసే వ్యక్తులను శిక్షించకుండా, వారికి సహాయం అందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగం కానున్నాయి. ఈ విధానం ఇప్పటికే మిజోరాం వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆ మోడల్‌ను ఆధారంగా తీసుకుని, ఏపీ ప్రభుత్వం ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించింది.
సామాజిక సంస్కరణతోపాటు సంస్కృతిక వేడుకలు. భిక్షాటన చట్టంతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు భాషాభిమానులను ఉత్సాహపరిచేలా, సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రతి ఏడాది నవంబర్ 10న ఈ వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు భాషా ప్రాచుర్యం, అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సత్యసాయి శతజయంతికి రూ.10 కోట్లు మంజూరు
అలాగే పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు నిధులు కేటాయించింది. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానుండటంతో ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిధుల మంజూరు పై పిల్ దాఖలు అయినప్పటికీ, హైకోర్టు ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది. ఈ చర్యలన్నీ కలిపి చూస్తే, ఏపీ ప్రభుత్వం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా పటిష్ఠమైన అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.