ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ యువతకు ఇదొక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు . ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసినదే. కాగా అమరావతిలో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరులోని సీఆర్డీఏ స్కిల్ హబ్ వేదికగా అక్టోబర్ 31న ఉదయం 10 గంటల నుండి ఈ మేళా ప్రారంభం కానుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, సీఆర్డీఏ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొంథా తుఫాన్ కారణంగా ముందుగా నిర్ణయించిన తేదీ వాయిదా పడగా ఇప్పుడు అన్నీ సిద్ధమయ్యాయి.
ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయి. ఐటీ హెల్త్‌కేర్, మార్కెటింగ్, టెక్నికల్ రంగాలకు చెందిన సంస్థలు రాబోతున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎఫ్ట్రానిక్స్, ప్రింగిల్ ఐటీ వెంచర్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ జాబ్ ప్రొఫైల్స్ సమర్పించాయి.
ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, డిగ్రీ లేదా పీజీ చదివిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫ్రెషర్స్ అయినా, అనుభవం ఉన్నవారైనా అవకాశం ఉంది.
ఇంజినీర్ టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్, టెలికాలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి ఉద్యోగాల కోసం నియామకాలు జరగనున్నాయి.
ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనం లభిస్తుంది. కొంతమంది అభ్యర్థులకు వసతి, భోజనం, అలవెన్సులు, ఇన్సెంటివ్‌లు కూడా అందిస్తామని అధికారులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జాబ్ మేళాలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా నైపుణ్యం పోర్టల్ naipunyam.ap.gov.in https://naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం మాత్రమే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికీ కృషి చేస్తోంది. ఈ జాబ్ మేళా ఆ ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన భాగం చెప్పుకోవచ్చు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సర్టిఫికేట్లు, రిజ్యూమ్ తీసుకెళ్లి ప్రత్యక్షంగా హాజరు కావాలి. అమరావతి జాబ్ మేళా — ఒక అడుగు మీ కెరీర్ వైపు!