భారతదేశం ప్రపంచ సైబర్ భద్రతా రంగంలో అగ్రస్థానంలోకి అడుగేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సెర్ట్-ఇన్’ (CERT-In) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బహల్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 400కు పైగా సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌లు ఉన్నాయని, 6.5 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు ఈ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా దేశ సైబర్ భద్రతా పరిశ్రమ విలువ 20 బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన వివరించారు. ఐరోపా సమాఖ్య (EU) దేశాల నుండి వచ్చిన జర్నలిస్టుల బృందంతో సమావేశం సందర్భంగా ఆయన భారత సైబర్ పరిణామాలపై విశ్లేషణ ఇచ్చారు.
భారత ఆవిష్కర్తలు థ్రెట్ డిటెక్షన్, సైబర్ ఫోరెన్సిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వంటి అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారని డాక్టర్ బహల్ తెలిపారు. సురక్షితమైన డిజిటల్ వాతావరణం కోసం ఈ సాంకేతికతలు కీలకమని ఆయన పేర్కొన్నారు. దేశీయ సాంకేతిక మేధస్సు వల్ల సైబర్ దాడులను సమర్థవంతంగా గుర్తించి, వాటికి వేగంగా ప్రతిస్పందించగలగడం సాధ్యమైందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత సైబర్ భద్రతా వ్యవస్థ విశ్వసనీయంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐ (Artificial Intelligence) సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని సంజయ్ బహల్ వ్యాఖ్యానించారు. ఇది రక్షణ వ్యవస్థలకు ఎంత మేలు చేస్తుందో, దాడి చేసే సైబర్ నేరగాళ్లకూ అంతే అవకాశాలు కల్పిస్తుందని ఆయన హెచ్చరించారు. సెర్ట్-ఇన్ ప్రస్తుతం ఏఐ ఆధారిత విశ్లేషణలు, ఆటోమేషన్ ద్వారా సైబర్ దాడులను నిజ సమయంలో గుర్తించి, ప్రతిస్పందించగల సదుపాయాలను అభివృద్ధి చేసిందని తెలిపారు. అదే సమయంలో ఏఐను దుర్వినియోగం చేస్తూ జరిగే దాడులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ఏడాది దేశంలో 147 రాన్సమ్వేర్ దాడులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. సెర్ట్-ఇన్ తక్షణ చర్యలు, ఫోరెన్సిక్ జోక్యం, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి ద్వారా వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. దేశీయంగా సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్‌లకు ప్రభుత్వం పాలసీ మద్దతు, శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా భారత్ ఫ్రాన్స్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (ANSSI) వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ పటిష్ఠమైన గ్లోబల్ సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.