Washington : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ గారు కఠినమైన నాయకుడు అయినా నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఆయనతో నాకు ఉన్న బంధం ప్రత్యేకం అంటూ ట్రంప్ వెల్లడించారు.
ఆసియా–పసిఫిక్ ఆర్థిక సమావేశానికి ముందు దక్షిణ కొరియాలో ప్రసంగించిన ట్రంప్, భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం (Trade Deal) దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మేము ఇండియాతో ఒక గొప్ప ఒప్పందం చేస్తున్నాం. మోదీ గారిపై నాకు గౌరవం ఉంది అని వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో అమెరికా భారత దిగుమతులపై 50% వరకు అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కారణం భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం.అయితే భారత ప్రభుత్వం మా ఇంధన కొనుగోళ్లు రాజకీయాల కంటే ఆర్థిక అవసరాలకే సంబంధించినవి అంటూ స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశగా సాగుతున్నాయనే సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి.
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో మద్యవర్తిగా వ్యవహరించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్ ఆ సమయంలో నేను మోదీ గారితో పాకిస్తాన్ నాయకుడితో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేశాను. ఇద్దరూ చాలా కఠిన నాయకులు కానీ చివరికి వివేకంతో వ్యవహరించారు అని అన్నారు.
అదే ప్రసంగంలో ఆయన సరదాగా మోదీ గారు చాలా స్మార్ట్, హ్యాండ్సమ్ లీడర్. ఆయనతో మాట్లాడిన తర్వాత ఎప్పుడూ వావ్ ఈయనే ఆ వ్యక్తి! అని అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలు రాబోయే వాణిజ్య ఒప్పందంపై చర్చలకు ఊతమివ్వొచ్చు. నిపుణుల అంచనా ప్రకారం, అమెరికా–భారత్ ట్రేడ్ ఒప్పందం కుదిరితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది.