జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇటీవల జోర్డాన్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తున్న 12 మంది తెలంగాణ కార్మికులు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీడియో ద్వారా వెల్లడించారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి దృష్టి సారించగా, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిఏడి ఎన్నారై విభాగం తక్షణ చర్యలు ప్రారంభించింది. వారు భారత రాయబార కార్యాలయంతో పాటు ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించి, కార్మికుల కేసును ‘మదద్’ పోర్టల్‌లో నమోదు చేశారు.
జిఏడి ఎన్నారై విభాగానికి చెందిన ఐఏఎస్ అధికారులు సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి మరియు సి.హెచ్. శివలింగయ్య ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజల భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. జోర్డాన్ ఘటనను మానవీయ కోణంలో చూడాలని, రాజకీయ కోణంలో లాగరాదని ఆయన బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
ఇక జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు 'మిల్లీనియం అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్' అనే కంపెనీని ప్రత్యక్షంగా సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న మొత్తం 170 మంది భారతీయ కార్మికులలో చాలా మంది సంతృప్తిగా ఉన్నారని, అయితే తెలంగాణకు చెందిన 12 మంది మాత్రం పని చేయడానికి నిరాకరించి, భారత్‌కు తిరిగి పంపాలని కోరుతున్నారని ఎంబసీ నివేదికలో పేర్కొన్నారు.
ఎంబసీ అధికారులు సమీక్షించిన ప్రకారం, కంపెనీ తమ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పిస్తోందని తేలింది. ఆహార సమస్యల పరిష్కారానికి ప్రత్యేక భారతీయ వంటకారుడిని నియమించారని, జీతాలు ఫింగర్‌ప్రింట్ ధృవీకరణ ద్వారా చెల్లిస్తున్నారని చెప్పారు. అలాగే నివాసం, వైద్యం వంటి సౌకర్యాలు ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం పనికి హాజరుకాని ఆ 12 మంది కార్మికులు రూముల్లోనే ఉన్నారని, ఇది ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడవచ్చని ఎంబసీ హెచ్చరించింది. వారు పని చేయకుంటే జీతాలు చెల్లించలేమని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) కింద వారు ప్రయోజనాలు పొందడం కష్టమని అధికారులు తెలిపారు.