ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ మరోసారి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వాలా అనే అంశంపై చర్చ జరగనుంది. ఈ క్షిపణులు రష్యా లోతైన ప్రాంతాలను తాకగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
ట్రంప్–పుతిన్ మధ్య జరిగిన తాజా ఫోన్ సంభాషణ తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సంభాషణను ట్రంప్ చాలా ఫలప్రదంగా పేర్కొన్నారు. ఇద్దరూ హంగేరీలో ప్రత్యక్షంగా కలవాలని అంగీకరించారు.
జెలెన్స్కీ అమెరికా చేరిన వెంటనే రష్యా టోమాహాక్ క్షిపణుల చర్చ విన్న వెంటనే సంభాషణ కోసం పరుగులు తీస్తోంది అని వ్యాఖ్యానించారు. ఆయన ఉక్రెయిన్ భద్రత కోసం ఈ క్షిపణులు అత్యవసరం అని తెలిపారు.
ట్రంప్ మాత్రం అమెరికా వద్ద ఉన్న క్షిపణులను పూర్తిగా ఇవ్వలేము. మనకూ అవి అవసరం అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఉక్రెయిన్ అభ్యర్థనను ఇంకా పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ట్రంప్ మరియు పుతిన్ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో యుద్ధం ముగిసిన తర్వాత రష్యా–అమెరికా వాణిజ్యంపై మంచి పురోగతి సాధించాం అని పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారం ఇరు దేశాల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారని తెలిపారు. అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు.
హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ ఈ సమావేశాన్ని స్వాగతిస్తూ, ఇది ప్రపంచంలో శాంతి కోరే ప్రజలందరికీ శుభవార్త అన్నారు. యూరోపియన్ యూనియన్ యుద్ధానికి మద్దతు ఇస్తోందని, అందుకే ఈ శాంతి ప్రయత్నాల నుంచి దూరంగా ఉంటుందని ఆయన విమర్శించారు.
ఇక జెలెన్స్కీ అమెరికాకు రాకముందే రష్యా ఉక్రెయిన్‌పై భారీ దాడులు చేసింది. ఉక్రెయిన్ రాయబారి తెలిపిన ప్రకారం రష్యా 28 బాలిస్టిక్ క్షిపణులు, 320 డ్రోన్లతో దాడి చేసింది. ఇది రష్యా నిజమైన ఉద్దేశాన్ని బయటపెడుతోంది. శాంతి పేరుతో మోసం చేస్తోంది అని ఆమె అన్నారు.
ట్రంప్ గత కొన్ని నెలలుగా పుతిన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఆగస్టులో అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత ఆయన రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలనే హెచ్చరికలు ఇచ్చారు. అయితే ఆ చర్చలతో గణనీయమైన పురోగతి సాధించలేకపోయారు.
ఇటీవల ట్రంప్ ఉక్రెయిన్ పట్ల తన వైఖరిని మారుస్తూ, కీవ్ తిరిగి తన మొత్తం భూభాగాన్ని పొందగలదు అని ప్రకటించారు. ఇది ఆయన ముందు చెప్పిన ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాలు వదిలేయాలి అనే అభిప్రాయానికి పూర్తి విరుద్ధం అని భావిస్తున్నారు