దీపావళి సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా మిఠాయి దుకాణాలు రద్దీగా మారాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు బహుమతులు, స్వీట్లు అందించే ఈ సీజన్‌లో మిఠాయిలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మిఠాయి షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
ఇదే సమయంలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని మిఠాయి వ్యాపారి అంజలి జైన్ ఒక ప్రత్యేకమైన, విలాసవంతమైన స్వీట్‌ను తయారు చేసి వార్తల్లో నిలిచారు. ఆమె రూపొందించిన ఈ స్వీట్‌కు స్వర్ణ ప్రసాదం అనే పేరు పెట్టారు. ఈ స్వీట్ కిలో ధర రూ. 1.11 లక్షలు అని నిర్ణయించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనే చెపుకోవచ్చు .
అంజలి జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్వీట్ తయారీలో కుంకుమ పువ్వు (సాఫ్రాన్), పైన్ గింజలు (చిల్గోజా), అలాగే స్వర్ణ భస్మం (బంగారు పొడి) ఉపయోగించారని చెప్పారు. ఇవన్నీ అత్యంత ఖరీదైన పదార్థాలు కావడం వల్లే ఈ స్వీట్ ధర అంతగా ఉందని ఆమె వివరించారు.
మరియు ఈ స్వీట్లు సాధారణ ప్యాకేజింగ్‌లో కాకుండా, శుద్ధమైన బంగారంతో పూతపూసిన ప్రత్యేక పెట్టెల్లో ప్యాక్ చేయబడతాయి. ఆ పెట్టెలు ఆభరణాల పెట్టెల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ డిజైన్, ప్యాకింగ్ కూడా స్వీటు విలువను మరింత పెంచుతుందని చెబుతున్నారు.
స్వర్ణ ప్రసాదం ప్రత్యేకత ఏమిటంటే – ఇది సాధారణంగా లభించే మిఠాయి కాదు. దీన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేయించాల్సి వస్తుంది. ఉదాహరణకు, కుంకుమ పువ్వు కాశ్మీర్ నుంచి, పైన్ గింజలు విదేశాల నుంచి తెప్పించుకోవాలి. అలాగే నాణ్యమైన స్వర్ణ భస్మం కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది.
అందుకే ఈ స్వీట్ ధర కిలోకు లక్ష రూపాయలకు మించి ఉండటం సహజమే అంటున్నారు మిఠాయి వ్యాపార నిపుణులు. పండుగల సీజన్‌లో విలాసవంతమైన బహుమతులు ఇవ్వాలనుకునే వారు ఈ స్వీట్‌ను ఆర్డర్ చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా బంగారాన్ని శుభప్రతీకంగా పరిగణించే భారతీయ సంప్రదాయం ఉన్నందున, బంగారం ఆధారిత స్వర్ణ ప్రసాదం అనే ఈ మిఠాయి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
జైపూర్ నగరంలోని ఈ కొత్త ఆవిష్కరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిఠాయి ప్రియులు ఈ స్వీట్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. కొందరు దీన్ని భారతదేశంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి గా అభివర్ణిస్తున్నారు.