FinancialNews: భారత ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్రం త్వరలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) లను ఒకే గొడుగుకిందికి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విలీనం అమలు అయితే,
ఎస్బీఐ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఆ కొత్త సంస్థ నిలవనుంది.
ప్రస్తుతం ఎస్బీఐ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్దదైతే, బ్యాంక్ ఆఫ్ బరోడా రెండో స్థానంలో ఉంది. కానీ యూనియన్–బీఓఐ విలీనం జరిగితే ఆ స్థానాన్ని అది అధిగమించనుంది. అంచనాల ప్రకారం ఈ విలీనం తర్వాత కొత్త బ్యాంక్ ఆస్తుల విలువ రూ.25.6 లక్షల కోట్లకు చేరనుంది — అంటే ఐసీఐసీఐ బ్యాంక్ స్థాయికి దగ్గరగా ఉంటుంది.
సమాచారం ప్రకారంచెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)లను కూడా ఒకే సంస్థగా మార్చే ఆలోచన కేంద్రానికి ఉంది. వీటిని కలిపి దక్షిణ భారత మార్కెట్లో బలమైన ప్రభుత్వ బ్యాంక్‌ను సృష్టించడమే ఉద్దేశ్యం.
అదే సమయంలో తక్కువ ఆస్తులు కలిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (P&S Bank) లను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో కొత్త పేజీ తెరుస్తుందనడంలో సందేహం లేదు.
2020 తర్వాత మరోసారి సంస్కరణల జోరు
మోదీ ప్రభుత్వం చివరిసారిగా 2020లో భారీ విలీనాలు చేసింది. అప్పటికి 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, ఆ సంఖ్య 12కి తగ్గింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మరో దశలో పెద్ద బ్యాంకులను సృష్టించడం ద్వారా ప్రభుత్వం గ్లోబల్ స్థాయిలో పోటీ చేసే మెగా పీఎస్‌బీలు ఏర్పరచాలని చూస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలోని అగ్ర 100 బ్యాంకుల్లో మన దేశం నుంచి ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ మాత్రమే ఉన్నాయన్నది వాస్తవం. అందుకే ప్రభుత్వం మరికొన్ని అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను సృష్టించివికసిత్ భారత్ 2047 లక్ష్యానికి తోడ్పడే ప్రయత్నం చేస్తోంది.
ఇక ప్రభుత్వ ఆలోచనల ప్రకారం పీఎస్బీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 20 శాతం నుండి 49 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు మూలధనం పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో స్థానం బలపడనుంది.
ఒక సీనియర్ ఫైనాన్స్ అధికారి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వేళ ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ఉంది. విలీనాల వల్ల పరిపాలన సరళత, ఆర్థిక బలం, టెక్నాలజీ వినియోగం మూడు దిశల్లోనూ లాభం ఉంటుంది అని తెలిపారు.
యూనియన్–బీఓఐ విలీనం జరిగితే అది బ్యాంకింగ్ రంగానికి మైలురాయిగా నిలుస్తుంది. భారీ ఆస్తులు, విస్తృత నెట్వర్క్, మెరుగైన సేవలు ఈ కలయిక భారత ఆర్థిక రంగానికి కొత్త శక్తినిస్తుంది. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త సంస్కరణలు రాబోయే సంవత్సరాల్లో భారత బ్యాంకింగ్ మ్యాప్‌ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.