ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక కీలక గమనికను జారీ చేసింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ (eKYC) ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ పథకాల నిధులు నిజమైన అర్హులకే చేరేలా ఈ చర్య తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఈకేవైసీ క్యాంపులు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఆధార్ కార్డు, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా అందే ఓటీపీతో ఈకేవైసీని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారిక వెబ్సైట్ లింక్ కూడా అందుబాటులోకి తెచ్చింది.
సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈకేవైసీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ, లబ్ధిదారులు స్వయంగా ముందుకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది. పథకాల నిధులు నిలిచిపోకుండా ఉండాలంటే ప్రతి లబ్ధిదారు తమ ఈకేవైసీని సమయానికి పూర్తి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఈకేవైసీ డెడ్‌లైన్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల డేటా ఆధార్‌తో సమన్వయం అవుతుందన్న కారణంగా, పథకాల పంపిణీ పారదర్శకంగా, మోసరహితంగా సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక విద్యార్థులకు సంబంధించిన పథకాల విషయంలో కూడా ఈకేవైసీ తప్పనిసరి. ప్రస్తుతం విద్యార్థులు ‘తల్లికి వందనం’, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన వంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరందరూ తమ ఆధార్‌ను సరిచేసుకుని జనరల్ ఆధార్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవాలి. విద్యార్థులను రెండు వయస్సు వర్గాలుగా (5–15, 15–17 సంవత్సరాలు) విభజించి, బాల ఆధార్ సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు అధికారులు. అక్టోబర్ 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం మొంథా తుఫాన్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ పునఃప్రారంభించనున్నట్టు విద్యా శాఖ తెలిపింది.
అదే విధంగా కేంద్ర ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నపిల్లల ఆధార్ నమోదు కూడా తప్పనిసరి చేయబడింది. ఐసీడీఎస్ అధికారులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు తమ పరిధిలోని పిల్లలందరికీ ఆధార్ నమోదు పూర్తి చేయాలనే బాధ్యతను స్వీకరించారు. మొత్తంగా చూస్తే, పథకాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండడం, అర్హులైన వారికే లబ్ధి చేకూరడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. ‘పథకాల్లో పారదర్శకత– ప్రజలకే లబ్ధి’ అనే నినాదంతో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది.