కొంతకాలంగా వాణిజ్య యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన అమెరికా–చైనా సంబంధాలు మరోసారి మలుపు తిరిగాయి. ప్రపంచంలోని అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం అత్యంత ఫలప్రదంగా నిలిచింది. ఈ భేటీని ట్రంప్ “ఒక అద్భుతమైన కొత్త ఆరంభం”గా అభివర్ణించారు. చర్చల అనంతరం ఆయన చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సంచలనం సృష్టించింది.
రెండు గంటలపాటు సాగిన రహస్య చర్చల్లో అనేక కీలక అంశాలపై చర్చించగా, ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ట్రంప్ మాట్లాడుతూ “ఇది ఎంతో ప్రగతిశీలమైన సమావేశం. సదభిప్రాయం ఏర్పడింది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం” అన్నారు. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై 57 శాతం సుంకం ఉన్నదని, దాన్ని 47 శాతానికి తగ్గించడం తమ సత్సంకల్పానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ చర్చల్లో అత్యంత కీలకమైన అంశం రేర్ ఎర్త్స్ ఎగుమతులపైనే. అమెరికా రక్షణ, హైటెక్ పరిశ్రమలకు అవి అత్యవసరం. ఈ రంగంలో అడ్డంకులను చైనా తొలగించేందుకు అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. దీంతో రేర్ ఎర్త్స్ సరఫరాలో వచ్చే ఏడాది వరకు ఎటువంటి అంతరాయం ఉండదని అమెరికా అధికారులు తెలిపారు. అదేవిధంగా, అమెరికా రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సోయాబీన్స్ కొనుగోళ్లను చైనా తక్షణమే పునఃప్రారంభించనుందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇది మా రైతులకు గొప్ప విజయమని” ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మరో కీలక అంశంగా ఫెంటానిల్ అనే డ్రగ్ ఉత్పత్తిని అరికట్టేందుకు చైనా కఠిన చర్యలు తీసుకుంటుందని షీ జిన్పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాలో ఒపియాయిడ్ సంక్షోభానికి ఇది ప్రధాన కారణమని ట్రంప్ తెలిపారు. సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పరస్పర పర్యటనల ప్రణాళికలు కూడా ప్రకటించారు. “తైవాన్ అంశం ఈ చర్చల్లో అసలు ప్రస్తావనకే రాలేదు” అని ట్రంప్ వెల్లడించడం విశేషం. దీంతో అమెరికా–చైనా సంబంధాలు మరింత సానుకూల దిశలో పయనించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.