భారతీయ సినిమా ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఎస్.ఎస్. రాజమౌళి మహత్తర కృతిగా నిలిచిన “బాహుబలి” సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారి “బాహుబలి – ది ఎపిక్” అనే పేరుతో 3 గంటల 45 నిమిషాల నిడివి కలిగిన రీ-ఎడిటెడ్ వెర్షన్‌గా విడుదల కాబోతోంది. ఇందులో “బాహుబలి: ది బిగినింగ్” మరియు “బాహుబలి: ది కన్‌క్లూజన్” అనే రెండు భాగాలను కలిపి ఒక అద్భుతమైన గాథగా రూపొందించారు.
అమెరికాలో ఇప్పటికే ఈ కొత్త వెర్షన్ ప్రీమియర్ జరిగింది. అక్కడ ప్రేక్షకుల నుండి వచ్చిన తొలి స్పందనలు అద్భుతంగా ఉన్నాయి. చాలామంది ఈ సినిమా మళ్లీ కొత్తగా అనిపించిందని, దాదాపు పదేళ్లు గడిచినా అదే ఉత్కంఠ, అదే భావోద్వేగం కొనసాగుతోందని చెబుతున్నారు.
మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని అమెరికాలో జరిగిన ఈ ప్రీమియర్‌కి హాజరయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ, “నాకు బాహుబలి ఎలా చనిపోయాడు తెలుసుకోవడానికి రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం చాలా నచ్చింది. కానీ మొత్తం అనుభవం అసాధారణం. మన తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఇంత గుర్తింపు పొందడం నాకు గర్వకారణం. ఇది చూసినప్పుడు నాకు గూస్‌బంప్స్ వచ్చాయి ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను” అని తెలిపారు.
ఆయన ఇంకా చెప్పిన దాంట్లో, “బాహుబలి – ది ఎపిక్‌ను పెద్ద తెరపై చూడటం నిజంగా అద్భుతమైన అనుభవం. ఇది నా మొదటి పెద్ద సినిమా అనుభవాలలో ఒకటి” అన్నారు.
ఆన్‌లైన్‌లో కూడా ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు సోషల్ మీడియాలో ఇలా రాశారు: “#BaahubaliTheEpic ఫస్ట్ హాఫ్ అసలు ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వదు. ప్రతి సన్నివేశం వేగంగా ముందుకు సాగుతుంది. విజువల్స్, ఆడియో ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గలేదు.” మరొకరు కామెంట్ చేశారు: “IMAX కోసం సరైన రీతిలో ఆప్టిమైజ్ చేశారు. చిత్రం నాణ్యత తగ్గలేదు. ఇది సాదారణ రీ రిలీజ్ కాదు, మన కోసం, ప్రపంచం కోసం మళ్లీ ఒక అద్భుత అనుభవం తీసుకొచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు.” అన్నారు.
ఇంకా కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది. అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆతృతను వ్యక్తపరుస్తూ చెబుతున్నారు: “10 ఏళ్లు అయినా అదే ఫీల్, అదే గూస్‌బంప్స్. ఈ ఎపిక్ మిస్ కావొద్దు” “బాహుబలి – ది ఎపిక్” మరోసారి భారతీయ సినిమాకి గర్వకారణం కానుంది. రాజమౌళి మళ్లీ ప్రేక్షకులని తన మంత్రంతో ఆకట్టుకోబోతున్నాడనే చెప్పొచ్చు.