అమెరికాలో జరిగిన కీలక ఎన్నికల్లో న్యూయార్క్ సిటీ వర్జీనియా, న్యూ జెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఉత్సాహంగా ఓటు వేశాయి. 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వైట్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత జరిగిన ఇదే మొదటి ప్రధాన ఎన్నిక. అందుకే ఈసారి రాష్ట్రస్థాయి ఎన్నికలకు జాతీయ ప్రాధాన్యత ఏర్పడింది.
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలో డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ముందంజలో ఉన్నారని అసోసియేటెడ్ ప్రెస్ సర్వే తెలిపింది. ఆయన విజయం సాధిస్తే, న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గానూ, యువతర నాయకుడిగానూ నిలుస్తారు. 34 ఏళ్ల మమ్దాని ఈ ఏడాది ప్రారంభంలోనే డెమోక్రటిక్ ప్రైమరీలో విజయం సాధించి ప్రధాన పోటీలోకి వచ్చారు.
ఆయనకు ఎదురుగా మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్నికల సందర్భంగా న్యూయార్క్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేశారు. నగర ఎన్నికల బోర్డు ప్రకారం ఈసారి 20 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించారు — 1969 తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతం బహుశా ఇదేనేమో.
మమ్దాని విజయం సాధిస్తే ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ సిద్ధాంతానికి అమెరికా రాజకీయాల్లో కొత్త గుర్తింపు వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆండ్రూ కువోమో గెలిస్తే, నాలుగేళ్ల క్రితం లైంగిక వేధింపుల ఆరోపణలతో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయ పునరాగమనానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది.
వర్జీనియాలో చారిత్రాత్మక విజయం
వర్జీనియా రాష్ట్రంలో డెమోక్రాట్ ఆబిగైల్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా విజయం సాధించారు. ఆమె ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించారు. మాజీ సీఐఏ అధికారి అయిన ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి విన్సమ్ ఎర్ల్-సియర్స్‌ను ఓడించారు. అదే రాష్ట్రంలో భారతీయ మూలాలున్న ఘజాలా హష్మీలెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపొందారు. ఆమె వర్జీనియా రాష్ట్ర చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మరియు తొలి ముస్లిం మహిళా లెఫ్టినెంట్ గవర్నర్.
పిట్స్‌బర్గ్ నగరంలో కోరీ ఓ’కానర్ మేయర్‌గా గెలిచారు.
సిన్సినాటి మేయర్‌గా అఫ్తాబ్ ప్యూర్వల్ తిరిగి ఎన్నికయ్యారు.
అట్లాంటా నగరంలో ఆండ్రే డికెన్స్ రెండోసారి మేయర్‌గా విజయం సాధించారు.
కాలిఫోర్నియాలో ఎన్నికల్లో డెమోక్రాట్లు మంచి ఆధిక్యం సాధించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
అమెరికన్ ఓటర్లు ఈసారి ప్రధానంగా ఆర్థిక అంశాలునే ప్రాధాన్యంగా పరిగణించినట్లు AP ఓటర్ సర్వే తెలిపింది. ద్రవ్యోల్బణం, ఉద్యోగ అవకాశాల కొరత, ప్రభుత్వ ఆర్థిక అస్థిరతల వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడిచినా, ధరల పెరుగుదల మరియు ఆర్థిక అనిశ్చితి ప్రజలను కలవరపెడుతోందని సర్వే స్పష్టం చేసింది.
మమ్దాని విజయం సాధిస్తే, ఆయన విధానాలు న్యూయార్క్ నగర ఆర్థిక రంగంపై ప్రభావం చూపవచ్చని వాల్ స్ట్రీట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద కార్పొరేట్‌లపై పన్నులు పెంచాలని ఆయన ప్రకటించిన విషయం వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. అయినప్పటికీ, ఆయన సాఫ్ట్ దృక్పథం తీసుకుంటారనే ఆశాభావం కూడా కొందరిలో ఉంది.
ఈ ఎన్నికలు అమెరికాలో రాజకీయ దిశను నిర్ణయించే సూచనలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ ఎన్నిక ఫలితాలు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.