ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టులపై ముమ్మర కూంబింగ్ చేపట్టగా, ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. తార్లగూడ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో ఈ ఆపరేషన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. పోలీసులు మృతుల వద్ద నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు అన్నారం, మరిమల్ల గ్రామాల మధ్య మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందాలతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరపడంతో తక్షణమే ప్రతిదాడి ప్రారంభమైంది. గంటకు పైగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ప్రాంతంలో ఇంకా కొంతమంది మావోయిస్టులు దాగి ఉన్నారనే అనుమానంతో బలగాలు సాయంత్రం వరకు ఆపరేషన్ కొనసాగించాయి.
పోలీసు అధికారులు మాట్లాడుతూ — “బీజాపూర్‌లోని తార్లగూడ అడవుల్లో జరుగుతున్న ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోనే ఉంది. హతమైన మావోయిస్టులు అంతర్రాష్ట్ర కమిటీలకు చెందినవారై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నాం. పూర్తి వివరాలను ఆపరేషన్ ముగిసిన తర్వాత వెల్లడిస్తాం” అని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలకు ఎలాంటి నష్టం జరగలేదని, కీలక స్థావరాలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్లుగా — 2026 మార్చి నాటికి దేశం మొత్తం నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు యుద్ధ స్థాయిలో ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. 2024 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1,785 మందిని అరెస్ట్ చేశారు. వివిధ ఆపరేషన్లలో 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ప్రభుత్వం ‘ఆత్మసమర్పణ్ ఏవం పునర్వాస్ నీతి 2025’, ‘నియాద్ నెల్ల నార్ యోజన’ వంటి పథకాల ద్వారా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తూ ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ చర్యలతో మావోయిజం తగ్గుముఖం పట్టిందని అధికారులు పేర్కొంటున్నారు.