ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాజధాని మరియు పరిసర ఎన్‌సీఆర్ ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయి, ప్రజలు ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) గణాంకాల ప్రకారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి (AQI) 400 మార్కును దాటింది. ఇది ‘తీవ్ర ప్రమాదకర’ శ్రేణిగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు సహాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్, సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
యూజింగ్ పేర్కొన్నదేమిటంటే—ఒకప్పుడు చైనా కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదని, అయితే ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యల వల్ల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని అన్నారు. “గాలి కాలుష్యం నియంత్రణలో మేము సాధించిన విజయాలు భారత్‌కు దోహదం అవుతాయి. మా అనుభవాలను పంచుకునేందుకు, సాంకేతిక సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. భారత్ త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందని విశ్వసిస్తున్నాం” అని యూజింగ్ పేర్కొన్నారు.
చైనా గాలి నాణ్యతను మెరుగుపరచడంలో చేపట్టిన చర్యలు గమనించదగ్గవి. బీజింగ్‌తో పాటు పలు పారిశ్రామిక నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరుకున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కఠిన నియంత్రణ విధానాలను అమలు చేసింది. కాలుష్య ఉద్గారాలపై పరిమితులు విధించి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై భారీ జరిమానాలు విధించింది. అదనంగా, పొగమంచు తీవ్రత పెరిగిన సమయాల్లో కొన్ని కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేసి, కొన్ని పట్టణాల నుంచి దూరంగా తరలించింది. ఈ చర్యలతో నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.
పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్ కూడా చైనా తరహా కఠిన చర్యలు తీసుకుంటే వాయు కాలుష్య సమస్యను కొంతమేర నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం, విద్యుత్ వాహనాల ప్రోత్సాహం, సౌర, పవన శక్తి ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టడం వంటి మార్గాలు సమర్థవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అనేక మంది మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చైనా సహకారం భారత్‌కు ఒక కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.