Business-పేలుడు ధాటికి నేలమట్టమైన ఫ్యాక్టరీ, 16 మంది మహిళలు బలి…..
బాణాసంచా సెంటర్‌లో వరుస పేలుళ్లు, 23కు చేరిన మృతుల సంఖ్య…
13 మంది రెస్క్యూ సిబ్బందికి గాయాలు, విరుదునగర్‌లో భీతావహ పరిస్థితి….
Bomb Explosion: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక ప్రైవేట్ బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం (ఏప్రిల్ 19, 2026) ఘోర ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 16 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది, వారు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదం 'వనజ' అనే బాణాసంచా ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. కార్మికులు కెమికల్స్ మిక్సింగ్ చేస్తున్న సమయంలో లేదా బాణాసంచాకు తుది మెరుగులు దిద్దుతున్న సమయంలో ఘర్షణ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలోని మూడు గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో రెండోసారి కూడా పేలుడు సంభవించడంతో సహాయక చర్యల్లో ఉన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహా మరో 13 మంది గాయపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసులను హుటాహుటిన ఘటనా స్థలానికి పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.