ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూప్ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా మహిళలకు సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు అందించే కార్యక్రమం ప్రారంభమైంది. “పింక్ మొబిలిటీ” పేరుతో ర్యాపిడో సంస్థతో భాగస్వామ్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా మహిళలు తమ సొంత వాహనాలను ఉపయోగించి ఆదాయం సంపాదించుకునే అవకాశం పొందుతున్నారు.
మహిళలు స్కూటీ, బైక్ లేదా ఆటో కొనుగోలు చేయాలనుకుంటే ప్రభుత్వం వారికీ సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తోంది. స్కూటీ లేదా బైక్ తీసుకునేవారికి రూ.12,000, ఆటో కొనుగోలు చేసేవారికి రూ.30,000 వరకు సబ్సిడీ ఇస్తారు. అంతేకాకుండా, మహిళలు ఎలాంటి ముందస్తు పెట్టుబడి లేకుండా రుణం పొందే అవకాశం కూడా ఉంది. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందేలా ప్రభుత్వం ముందడుగు వేసింది.
‘పింక్ మొబిలిటీ’ పథకంలో భాగంగా ర్యాపిడో రైడర్లుగా చేరిన మహిళలకు మొదటి మూడు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అంతేకాదు, వారు నెలకు రూ.25,000 నుండి రూ.30,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో పికప్, డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదనంగా, మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే అనేకమంది మహిళలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారు ప్రతి నెలా డబ్బులు సంపాదిస్తూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ, పిల్లల చదువులకు సహాయపడుతున్నారు. ఈ పథకం మహిళల జీవితాల్లో ఆర్థిక స్వాతంత్ర్యానికి మార్గం చూపుతోంది.
మెప్మా అధికారులు అర్హులైన మహిళలను 15 రోజుల్లో ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. లైసెన్స్ ఉన్న మహిళలు అవసరమైన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు, ఆర్థిక భద్రత లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇది మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న మరో ముందడుగు.