ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల మొంథా తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేసింది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, గాలులతో ప్రజల జీవన విధానం స్తంభించినా, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలతో పెద్ద నష్టం తప్పించగలిగింది. ముఖ్యంగా రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సాంకేతికత ఈ విపత్తు సమయంలో కీలకంగా మారింది. తుఫాన్ తీవ్రతను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం వీలైంది. ఈ సాంకేతికత ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రవ్యాప్తంగా RTGS వ్యవస్థను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో RTGS కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాలను రాజధాని అమరావతిలోని ప్రధాన RTGS కేంద్రంతో అనుసంధానం చేయనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఈ జిల్లాస్థాయి కేంద్రాలకు కనెక్ట్ చేయడం ద్వారా విపత్తుల సమయంలో, అలాగే ప్రజా సేవల నిర్వహణలో సమర్థత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనున్నారు. తుఫాన్‌లు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ సెంటర్లు “ప్రాణరక్షక కేంద్రాలుగా” మారతాయని భావిస్తున్నారు.
సచివాలయం సమీపంలో కొత్తగా రాష్ట్రస్థాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆధునిక కేంద్రం ద్వారా అన్ని RTGS కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. 264 మంది అధికారులు ఒకేసారి పనిచేయగల టేబుళ్లు, 338 మంది కూర్చునే పెద్ద మీటింగ్ హాల్, చిన్న సమావేశాల కోసం మినీ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, RTGS డైరెక్టర్ కార్యాలయం కూడా ఈ కేంద్రంలో భాగంగా ఉంటాయి. ప్రాజెక్ట్ అమలు బాధ్యతను ఎన్‌సీసీ-మ్యాట్రిక్స్ సంస్థ తీసుకోగా, కాలేజ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ థర్డ్ పార్టీ ఆడిట్, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఇక RTGS ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 750 రకాల సేవలను అందిస్తోంది. అదనంగా, ఇస్రో సహకారంతో ‘అవేర్ 2.0’ అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది, దీని ద్వారా శాటిలైట్ ఆధారంగా వాతావరణ సమాచారం రియల్‌టైమ్‌లో పొందవచ్చు. అలాగే అన్ని శాఖల డేటాను ఒకేచోట భద్రపరిచే ‘డేటా లేక్’ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ అన్ని ఆధునిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా ఈ కొత్త RTGS కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండబోతోంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.