వైయస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) హయాంలో "ఆడుదాం ఆంధ్ర" పేరిట జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోందని, ఈ నెల 15 నుంచి 20 రోజుల్లో తుది నివేదిక అందే అవకాశం ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) వెల్లడించారు.
బాపట్ల జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఆయా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు.
త్వరలో మూడు వేల కొత్త విద్యుత్ బస్సులు సేవలోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇక, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
రాత్రి పూట పని చేసే కార్మికులకు ప్రస్తుతం అందిస్తున్న రాత్రి భత్యాన్ని రూ.130కి పెంచే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని చెప్పారు.