ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సర్వేల ద్వారా సేకరించి, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేయించారు. జూన్ 27 నుంచి ఆయన ఒక్కో ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా సమావేశమవుతూ, వారి పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 21 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తయ్యాయి. ఒక్కో సమావేశం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగుతోంది.
ఈ సమావేశాల్లో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజలతో సంబంధాలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. బాగా పనిచేసిన ఎమ్మెల్యేలను అభినందిస్తూ, లోపాలున్న వారిని సవరించేందుకు సూచనలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ శ్రేణులతో సమన్వయం లోపించిందని భావించిన ఎమ్మెల్యేలకూ స్పష్టమైన మార్గదర్శనం ఇస్తున్నారు.
ఇటీవల గుంతకల్లు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు, ఇవాళ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను పిలిపించారు. ఈ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించారు. జూలై 19న తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబంతో వెళ్లిన సందర్భంగా, విమానంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేవలం “సార్ బావున్నారా?” అని అడిగి, 8 సెకన్ల పాటు మాత్రమే మాట్లాడానని చెప్పారు. అయితే దాన్ని పెద్దిరెడ్డిని రాజమహేంద్రవరంలో కలిశానని తప్పుడు వార్తలుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
తిరుపతిలో సీఎం కార్యాలయం నుంచి తనకు కాల్ రావడంతో అక్కడే చంద్రబాబుతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైనట్లు చెప్పారు. ఆ సమావేశంలో తాను ఎమ్మెల్యేగా చేసిన పనిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారని, తన పనితీరు 66.4% మార్కులతో ఉన్నట్లు వెల్లడించారు. అవినీతి ఆరోపణలు కేవలం 5.5% మాత్రమే ఉన్నట్లు రిపోర్టులో ఉన్నదని తెలిపారు. తాను ఎలా పనిచేస్తున్నానో తన నియోజకవర్గ ప్రజలు, ముఖ్యమంత్రి బాగా తెలుసునని, గాలి వార్తల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.