సినీ నటుడు రాజీవ్ కనకాల భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, అదే కేసులో నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 421లోని ఓ ఫ్లాట్‌ను రాజీవ్ కనకాల ఇటీవల విజయ్ చౌదరికి విక్రయించారు. అన్నీ అధికారికంగా రిజిస్ట్రేషన్ పూర్తైనట్లు సమాచారం. కానీ విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను మరో వ్యక్తి శ్రవణ్ రెడ్డికి రూ.70 లక్షలకు తిరిగి అమ్మేశారు.
అయితే ఇటీవల శ్రవణ్ రెడ్డి ఆ ఫ్లాట్‌ను పరిశీలించేందుకు వెళ్లగా, అక్కడ ఎలాంటి ప్లాట్ లేకపోవడం గమనించి, నకిలీ స్థలంతో మోసగించారనే అనుమానంతో విజయ్‌ను ప్రశ్నించారు. స్పందనలో విజయ్ వివాదముందని తప్పించుకోవడం, చివరికి బెదిరింపులకు దిగాడని శ్రవణ్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో స్థలాన్ని తొలి విక్రేతగా విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రపై స్పష్టత అవసరమై, ఆయనకు నోటీసులు పంపించారు. మొత్తం లావాదేవీలో ఆయన ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది.