ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఈ నెల జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పవన్ మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “రాజకీయాలతో బిజీ అయినా కూడా, తూతూమంత్రంగా సినిమాలు చేస్తున్నట్లు అనిపించకూడదనే ఉద్దేశంతో ఈ సినిమాపై ఎక్కువ కష్టపడ్డాను. కథ బలం చూసి నా బెస్ట్ ఇచ్చాను,” అని పవన్ తెలిపారు.

పవన్ రాజకీయాల కారణంగా గతంలో కొన్ని సినిమాలు ఆలస్యమయ్యాయని, తనకు ఉన్న ఏకైక ఆదాయం సినిమాలే కావడంతో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. "గత ప్రభుత్వం నా సినిమాలను అడ్డుకోవాలని ప్రయత్నించినా, నేను భయపడలేదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతాయన్న అనుమానం ఉంది. కానీ సినిమాలు తుపాకీ పెట్టి చూపించేవి కావు. అది ప్రేక్షకుల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థులు ఏం చేయాలో చేస్తారు, కానీ నాకు గుండె లో ఉన్న భారం తీరినట్లుగా సినిమా విడుదల అనిపిస్తుంది," అని పేర్కొన్నారు.

నిర్మాతల సహకారం గురించి మాట్లాడిన పవన్, కరోనా, రాజకీయాలు కారణంగా షెడ్యూళ్లు ఆలస్యం కావడంతో, రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చిత్రీకరణకు సమయం కేటాయించి, సినిమా పూర్తిచేశామని చెప్పారు. "ఎన్నికల ముందు సినిమాలు, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం సాధ్యపడలేదు. కానీ నా నిర్మాతలకు చెప్పాను – 'రాష్ట్ర పరిస్థితిని బట్టి మీరు అర్థం చేసుకోండి' అని. వాళ్లు కూడా పెద్ద మనసుతో అంగీకరించారు," అని పవన్ వివరించారు.

‘హరిహర వీరమల్లు’ కథ గురించి మాట్లాడుతూ, ఇది పాతబడిపోయిన కథ కాదు అని స్పష్టం చేశారు. "కొల్లూరు ప్రాంతంలో లభించిన **కోహినూర్ వజ్రం చుట్టూ నడిచిన చరిత్ర ఈ కథకు నేపథ్యం. దర్శకుడు క్రిష ఈ కథను బలమైన స్క్రీన్ ప్లేతో రూపొందించారు. కొంతకాలం క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నా, కథలోని అసలు ఆత్మ మాత్రం ఆయనదే. నేను ఒక ఆర్టిస్టుగా కాకుండా, సాంకేతికంగా ఆలోచిస్తూ పనిచేశాను," అన్నారు పవన్.

అంతేకాక, తనకు మార్షల్ ఆర్ట్స్ పరిజ్ఞానం ఉండటంతో యాక్షన్ సన్నివేశాల్లో లాజిక్కులు, న్యాయసమ్మతతపై దృష్టి పెట్టానని, క్లైమాక్స్‌ను తనదైన శైలిలో రూపొందించానని తెలిపారు. "ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ఉన్నట్టు యాక్షన్ చేయలేను. కానీ సన్నివేశం నా మనసుని తాకితే, దాన్ని పట్టుదలతో చేస్తాను. 'హరిహర వీరమల్లు'లో అలాంటి క్షణాలే ఉన్నాయి. ఇది చారిత్రకతను నిస్వార్థంగా చూపించబోయే సినిమా. అందుకే నా వంతుగా అన్ని విధాల కృషిచేశాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు.