ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోబోతున్నారు. పారిశ్రామిక నాయకత్వం, ప్రజా సేవ, సామాజిక సాధికారత రంగాల్లో ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ, లండన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ఆమెకు “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025” అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశిష్టమైన నాయకులకు మాత్రమే ప్రదానం చేస్తారు.
ఈ అవార్డును స్వీకరించేందుకు నారా భువనేశ్వరి తన భర్త, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరనున్నారు. నవంబర్ 4వ తేదీన లండన్‌లో జరుగనున్న గ్లోబల్ కన్వెన్షన్ వేదికపై ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆమె అందుకోనున్నారు. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, సంస్థాధిపతులు హాజరుకానున్నారు.
‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ అవార్డును గతంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ గోపిచంద్ హిందూజా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రముఖులు అందుకున్నారు. ఇప్పుడు నారా భువనేశ్వరి ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఆమె చేస్తున్న కృషిని ఈ సంస్థ ప్రత్యేకంగా గుర్తించింది.
భువనేశ్వరికి ఇది మాత్రమే కాక, మరో గౌరవం కూడా దక్కబోతోంది. ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీకి, కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో “గోల్డెన్ పీకాక్ అవార్డు” లభించింది. ఎఫ్ఎంసీజీ రంగంలో సంస్థ పాటించిన పారదర్శకత, నైతిక ప్రమాణాలకు ఈ అవార్డు అందింది. ఈ గౌరవాన్ని కూడా లండన్‌లో జరిగే అదే కార్యక్రమంలో భువనేశ్వరి స్వీకరించనున్నారు.
వ్యక్తిగత పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా లండన్‌లో పలు పారిశ్రామిక సమావేశాల్లో పాల్గొననున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ (CII Partnership Summit) కోసం ఆయన లండన్‌లోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ప్రవాసాంధ్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన అనంతరం నవంబర్ 6వ తేదీన సీఎం తిరిగి భారత్ చేరుకుంటారు.