కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) వద్ద డ్రోన్ ద్వారా చేపట్టిన యూఏవీ లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM-V3) ప్రయోగం విజయవంతమైంది. డీఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష దేశ రక్షణ రంగానికి మైలురాయిగా మారింది.
ఈ విజయాన్ని పురస్కరించుకొని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో భాగస్వామ్యమైన ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ రంగాల్లో స్వదేశీ టెక్నాలజీకి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
2016-17లో ప్రారంభమైన NOARలో ఇప్పటివరకు అనేక ఆయుధ పరీక్షలు జరిగాయి. ULPGM-V3 ప్రయోగం ద్వారా మరో ముందడుగు వేసిన డీఆర్డీఓ, త్వరలో మరిన్ని అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అందుబాటులోకి తేనుందని సమాచారం.
ఈ ప్రయోగంతో భారతదేశం టెక్నాలజీ పరంగా ఇతర దేశాలతో పోటీ పడగలగే స్థాయికి చేరిందని నిపుణులు పేర్కొంటున్నారు. డ్రోన్ ఆధారిత మిసైల్ వ్యవస్థలు భవిష్యత్ యుద్ధాలలో కీలకంగా మారనున్నాయి.