మంచి ఆరోగ్యమే సమృద్ధి దేశానికి పునాది అని భావిస్తున్న సీఎం చంద్రబాబు, ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచేలా అధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు నివారించాలంటే ఆహారపు అలవాట్లు మారాలని, ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సిజేరియన్లను అడ్డుకోవాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అమలు కావాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటులకు ధీటుగా అభివృద్ధి చేయాలన్నారు.
ఔట్‌సోర్సింగ్ ద్వారా అవసరమైన సేవలు తీసుకోవాలన్న సీఎం, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.