తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్న వారికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం కొట్టివేసింది. ఆయన, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు చేపట్టాలని కోరారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన delimitaton ప్రక్రియను ఉదాహరణగా చూపుతూ, తెలుగు రాష్ట్రాలకు అదే ప్రమాణం వర్తించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే ధర్మాసనం తేల్చింది – రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు ఇది పరిమితి అని పేర్కొంది.
ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, ఇతర రాష్ట్రాల నుంచీ ఇలాంటి డిమాండ్‌లు వెల్లువెత్తే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయని తెలిపింది.
పురుషోత్తం రెడ్డి, జమ్మూకశ్మీర్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ, ధర్మాసనం ఆ వాదనను తిరస్కరించింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా జారీ చేసిన delimitaton నోటిఫికేషన్‌ను తెలుగు రాష్ట్రాలకు వర్తింపజేయకపోవడాన్ని వివక్షగా చూడలేమని తేల్చింది.
ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు తక్షణం సాధ్యపడదన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే ఏపీ విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు అవసరమని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా, కేంద్రం మాత్రం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఇంతలో సుప్రీం తీర్పుతో మరోసారి ఈ అంశం తాత్కాలికంగా పక్కనపడినట్టే కనిపిస్తోంది.