Power Bill Update Tips: సాధారణంగా మనకు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కావాలంటే గుర్తొచ్చేది కరెంటు బిల్లే. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలన్నా, బ్యాంక్ పనులకైనా కరెంటు బిల్లు ఒక కీలక పత్రంగా ఉపయోగపడుతుంది. అయితే, చాలామంది ఇల్లు కొన్నా లేదా వారసత్వంగా ఇల్లు వచ్చినప్పుడు కరెంటు బిల్లుపై పేరు మార్చుకోవడానికి ఏళ్ల తరబడి పాత యజమానుల పేర్లనే కొనసాగిస్తుంటారు. పేరు మార్చుకోవడం అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలని, కొత్త కనెక్షన్ తీసుకోవాలని భయపడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు, మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చుని సులభంగా మీ పేరు మీదకు మార్చుకోవచ్చు.
ఈ ఆన్లైన్ ప్రక్రియ కోసం మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీరు ఒక ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేసినట్లయితే, దానికి సంబంధించిన రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా గిఫ్ట్ డీడ్ కాపీ ఉండాలి. వీటితో పాటు మీ ఆధార్ లేదా పాన్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు అవసరం. ముఖ్యంగా వంద రూపాయల స్టాంపు పేపర్‌పై 'ఇండెమ్నిటీ బాండ్' సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్య పేరు మార్పిడి జరగాలంటే రూ.10 బాండ్ పేపర్‌పై ఎన్ఓసీ ఇస్తే సరిపోతుంది. ఇంటి యజమాని మరణిస్తే వారసులు డెత్ సర్టిఫికేట్ ద్వారా ఈ మార్పు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే ముందు మీరు స్కాన్ చేసిన పత్రాల సైజుపై దృష్టి పెట్టాలి. మీ గుర్తింపు కార్డు 100 కేబీ లోపు, ఇండెమ్నిటీ బాండ్ 500 కేబీ లోపు, మరియు సేల్ డీడ్ 5 ఎంబీ లోపు ఉండేలా పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో సిద్ధం చేసుకోవాలి. ఈ పత్రాలన్నింటిపై మీ సంతకం తప్పనిసరి. తెలంగాణ వాసులైతే టిజిఎస్పిడిసిఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్లి 'కన్జూమర్ సర్వీసెస్' విభాగంలో 'సర్వీస్ రిక్వెస్ట్' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
వెబ్సైట్లో మీ యూనిక్ సర్వీస్ నంబర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత అక్కడ కనిపించే ‘టైటిల్ ట్రాన్స్ఫర్’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు అడిగిన వివరాలన్నీ పూర్తి చేసి, మీరు సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఈ సర్వీస్ కోసం కేవలం రూ. 25 నామినల్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మీరు అప్లై చేసిన తర్వాత విద్యుత్ శాఖ అధికారులు మీ వివరాలను పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే పేరు మార్పిడిని ఆమోదిస్తారు.
ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వచ్చే నెల నుంచి వచ్చే కరెంటు బిల్లులో మీ పేరే కనిపిస్తుంది. దీనివల్ల పాత కనెక్షన్ రద్దు చేయాల్సిన అవసరం గానీ, కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేయాల్సిన పని గానీ ఉండదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో మీ పని పూర్తవుతుంది. ఇప్పటికైనా మీ కరెంటు బిల్లుపై పాత యజమాని పేరే ఉంటే, ఆలస్యం చేయకుండా ఈ ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించుకుని మీ పేరును అప్డేట్ చేసుకోండి. ఇది భవిష్యత్తులో మీకు అడ్రస్ ప్రూఫ్ పరంగా ఎంతో మేలు చేస్తుంది.