భారతీయ సంస్కృతిలో తులసి చెట్టు ఎంతో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇంటి ప్రాంగణంలో తులసిని నాటడం పరంపరగా కొనసాగుతోంది. పూజల్లో ఉపయోగించడమే కాదు, దాని ఆకులు ఆరోగ్యానికి మంచివని పెద్దలు చాలాకాలం నుంచే చెబుతూ వస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే తులసి ఆకులను నమలడం ఆరోగ్యాన్ని కాపాడుతుందన్న నమ్మకం గ్రామాల్లో, పట్టణాల్లో సమానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు కూడా ఈ సంప్రదాయానికి కొంత శాస్త్రీయ ఆధారాన్ని చూపుతున్నాయి.
పురాణాల నుంచి ఆయుర్వేదానికి వరకూ తులసిని ‘పవిత్ర’ మొక్కగా భావిస్తారు. దాని సువాసన, రుచి, వైద్య గుణాలు ఆయుర్వేద గ్రంథాల్లో వివరంగా చెప్పబడాయి. ఉదయం ఖాళీ కడుపుతో రెండు నుంచి నాలుగు చిన్న తులసి ఆకులు నమలడం శరీరానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, శ్వాసకోశాన్ని బలపరచడం వంటి లాభాలు తులసికి ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ప్రతి రోజు ఉదయం తులసి ఆకులు నమలడం వల్ల మనసులో ప్రశాంతత, స్పష్టత కలుగుతుందని తెలిసింది. మన శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని నియంత్రించడంలో తులసి సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగ ఒత్తిడితో, రోజువారీ గందరగోళంలో జీవించే వారికి తులసి కొంత ఉపశమనం ఇవ్వగలదనే అభిప్రాయం ఉంది. ఉదయం ఈ అలవాటు పాటించడం వల్ల మానసిక ఆందోళనలు తగ్గి, రోజును తేలికగా ప్రారంభించగలమని ప్రజలు చెబుతున్నారు.
శరీర రోగనిరోధక శక్తిని బలపర్చడంలో కూడా తులసి ముఖ్య పాత్ర వహిస్తుంది. దాని ఆకుల్లో ఉన్న సహజ రసాయనాలు జలుబు, దగ్గు వంటి చిన్న రుగ్మతల నుంచి రక్షణను అందిస్తాయి. తాజా ఆకులు నమలడం వల్ల ఈ రసాయనాలు త్వరగా శరీరంలో శోషించబడతాయి. నగర వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యంతో ఇబ్బంది పడే వారికి తులసి ప్రయోజనకరంగా మారవచ్చు. శ్వాసనాళాల్లో చేరిన మ్యూకస్‌ను తగ్గించడంలో, శ్వాసకోశానికి ఉపశమనం కలిగించడంలో తులసి సహాయం చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
తులసి జీర్ణక్రియకూ సహాయపడుతుంది. రోజును దీనితో ప్రారంభిస్తే కడుపులో ఆమ్లాలు సమతుల్యం కావచ్చు. అజీర్ణం, ఉబ్బరం, పొత్తికడుపు సమస్యల్లో తులసి మైల్డ్‌గా పని చేస్తుందని అనుభవం ఉంది. అలాగే రాత్రి సమయంలో శరీరంలో పేరుకున్న టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడుతుందని భావిస్తారు.
అయితే తులసి ఆకులు పరిమితంగా మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో పెంచిన మొక్కల నుంచే తీసుకోవడం మంచిదంటారు. బహిరంగంగా పెరిగిన తులసి ఆకుల్లో కాలుష్య పదార్థాలు లేదా రసాయనాలు ఉండే అవకాశం ఉండచ్చు.
అయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, తులసిని ఉదయం తీసుకోవడం శరీరాన్ని, మనసును సమతుల్యం చేసే సహజ పద్ధతి. పూర్తిగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.